Begin typing your search above and press return to search.

దేవినేని అవినాశ్ ఎందుకు టార్గెట్ అయ్యాడు ?!

దేవినేని అవినాశ్ S/O దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఏపీ పోలీసులు వెతుకుతున్న వ్యక్తులలో అతి ముఖ్యమైన వ్యక్తి.

By:  Tupaki Desk   |   10 Sep 2024 3:30 PM GMT
దేవినేని అవినాశ్ ఎందుకు టార్గెట్ అయ్యాడు ?!
X

దేవినేని అవినాశ్ S/O దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఏపీ పోలీసులు వెతుకుతున్న వ్యక్తులలో అతి ముఖ్యమైన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో అవినాష్ తో పాటు, అతని ముఖ్య అనుచరులు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అవినాశ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో హైకోర్టు బెయిలు నిరాకరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన అవినాష్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. దీంతో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ మీద, చంద్రబాబు మీద, లోకేష్ మీద అవినాష్ తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడంతో ప్రస్తుతం అతడు టార్గెట్ అయ్యాడు.

అవినాశ్ తండ్రి దేవినేని నెహ్రూ టీడీపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు కావడం గమనార్హం. అవినాశ్ కుటుంబానికి టీడీపీతో విడదీయలేని బంధం. వీరి సమీప బంధువు దేవినేని ఉమ కూడా టీడీపీలో కీలక నేత. ఉమతో పాటు ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు.

దేవినేని నెహ్రూ కంకిపాడు నియోజకవర్గం నుండి 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున వరసగా విజయం సాధించాడు. తెలుగుదేశం పార్టీ విడిపోయినప్పుడు ఎన్టీఆర్ వైపు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యాడు. 2009, 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి టీడీపీలో చేరాడు. ఆ తర్వాత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 2017లో మరణించాడు.

2016లో తండ్రితో కలిసి తిరిగి టీడీపీలో చేరిన అవినాశ్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేశాడు. 2019 ఎన్నికల్లో గుడివాడ శాసనసభ స్థానం నుండి కొడాలి నాని మీద పోటీ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుండి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయాడు.

విజయవాడ అంటే దేవినేని, దేవినేని అంటే టీడీపీ అన్నట్లు ఉండేది ఒకప్పుడు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో చేరిన అవినాశ్ టీడీపీ, చంద్రబాబు, లోకేశ్ ల మీద ఎవరూ చేయనన్న విమర్శలు చేసి టార్గెట్ గా నిలిచాడు.