దేవినేనికి దెబ్బ.. చంద్రబాబు కీలక నిర్ణయం
గత ప్రభుత్వంలో అవినాశ్ తండ్రి దేవినేని రాజశేఖర్ కు గుర్తుగా విజయవాడలోని మహానాడు రోడ్డుకు దేవినేని రాజశేఖర్ రోడ్డుగా పేరు పెట్టారు.
By: Tupaki Desk | 8 Feb 2025 10:30 AM GMTవైసీపీ నేత దేవినేని అవినాశ్ కు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో అవినాశ్ తండ్రి దేవినేని రాజశేఖర్ కు గుర్తుగా విజయవాడలోని మహానాడు రోడ్డుకు దేవినేని రాజశేఖర్ రోడ్డుగా పేరు పెట్టారు. అయితే ఎంతో చరిత్ర కలిగిన మహానాడు రోడ్డు పేరు మార్చడంపై స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు వెలువరించింది.
దేవినేని రాజశేఖర్ రోడ్డు పేరు తొలగింపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేవినేని అవినాశ్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నా ఆయన తండ్రి దేవినేని రాజశేఖర్ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా అంతా గుర్తు చేస్తున్నారు. తమ పార్టీ వ్యవస్థాపక సభ్యుడి పేరుతో ఉన్న రోడ్డు పేరు తొలగించడాన్ని రాజకీయంగా అనేక కోణాల్లో చూస్తున్నారు. విజయవాడలో దేవినేని అవినాశ్ కు చెక్ చెప్పడంతోపాటు దేవినేని ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఆలోచన కూడా ఉందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
అయితే కూటమి ప్రభుత్వం మాత్రం మహానాడు రోడ్డు పేరు పునరుద్ధరణకు రాజకీయ కోణం ఏమీ లేదని చెబుతోంది. దేవినేని రాజశేఖర్ రోడ్డుగా పేరు మార్చడం స్థానికులకు ఇష్టం లేదని, అందుకే మహానాడు రోడ్డుగా పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున లేఖలు అందాయని చెబుతోంది. స్థానికుల కోరిక మేరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు సైతం ప్రభుత్వానికి లేఖ రాశారు. దేవినేని రాజశేఖర్ పేరు తొలగించి మహానాడు రోడ్డు పేరు పునరుద్ధరించాలని కోరారు. దీంతో ప్రభుత్వం ప్రజాభిప్రాయానికే కట్టుబడాల్సివచ్చిందని అంటున్నారు. దీంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానాన్ని రద్దు చేసిందంటున్నారు. మొత్తానికి దేవినేని పేరు తొలగింపు రాజకీయంగా దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీని స్థాపించడంలో కీలకపాత్ర పోషించిన దేవినేని రాజశేఖర్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే బాగుండేదని టీడీపీలోనే ఉన్న ఆయన సన్నిహితులు సూచిస్తున్నారు. టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన దేవినేని 1995లో ఎన్టీఆర్ ను గద్దె దించడాన్ని జీర్ణించుకోలేక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో విభేదించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ టీడీపీలో చేరారు. తాను మరణించేటప్పుడు టీడీపీ జెండా కప్పాలని కోరుకున్న దేవినేని.. తుది శ్వాస విడిచే సమయానికి పార్టీలోనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అలాంటి నేత కోసమైనా ఆయన పేరు కొనసాగిస్తే బాగుండేదని చర్చ సాగుతోంది. అయితే మహానాడు రోడ్డుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దేవినేని పేరు తొలగించాల్సి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు దేవినేని అనుచరులను సముదాయిస్తున్నట్లు చెబుతున్నారు.