Begin typing your search above and press return to search.

టీడీపీ వ‌ర్మ ఓకే .. ఉమానే క‌నిపించ‌ట్లేదు.. !

సంతృప్తి-అసంతృప్తి మ‌ధ్య చాలా గ్యాప్ ఉంటుంది. సంతృప్తి చెందిన వారు అంతా బాగానే ఉంద‌ని అంటారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 4:30 PM GMT
టీడీపీ వ‌ర్మ ఓకే .. ఉమానే క‌నిపించ‌ట్లేదు.. !
X

సంతృప్తి-అసంతృప్తి మ‌ధ్య చాలా గ్యాప్ ఉంటుంది. సంతృప్తి చెందిన వారు అంతా బాగానే ఉంద‌ని అంటారు. అసంతృప్తితో ఉన్న నాయ‌కులు మంచిని కూడా చూడ‌లేరు. ఇప్పుడు టీడీపీలో ఇదే జ‌రుగుతోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్ పోగొట్టుకున్న సీనియ‌ర్ నాయ‌కులు.. అసంతృప్తితో ర‌గిలిపోతు న్నారు. వీరిలో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని చివ‌రి నిముషంలో వ‌దులుకున్న ఎస్‌వీఎస్ ఎన్ వ‌ర్మ ఒక‌రు. అదేవిధంగా మైల‌వ‌రం పీఠాన్ని త‌న అజాత శ‌త్రువుకు వ‌దులు కోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు కూడా బాధ‌క‌లిగింది.

అయితే.. చంద్ర‌బాబు సూచ‌న‌లు, భ‌విష్య‌త్తుపై ఉన్న భ‌రోసా వంటివి ఇద్ద‌రు నాయ‌కుల‌ను ముందుకు న‌డిపించాయి. దీంతో అప్ప‌ట్లో క‌లిసిపోయారు. త‌మ సీట్లు కోల్పోయినా.. ఆయా నేత‌ల ప్ర‌చారం కోసం ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో ఏడు మాసాలు అయిపోయి.. 8వ నెల‌లోకి వ‌చ్చేసినా.. త‌మ‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేద‌ని.. పార్టీలోనూ.. క్షేత్ర‌స్థాయి నియోజ‌క‌వ‌ర్గంలోనూ త‌మ‌కు గుర్తింపు లేకుండా పోయింద‌ని.. వ‌ర్మ‌, ఉమా కొన్నాళ్లుగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో వ‌ర్మ కొంత మేర‌కు స‌ర్దుకుపోతున్నారు. త‌న ఓటు బ్యాంకును పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు రెండేళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మా లు చేప‌ట్టారు. ప‌ది కిలో మీట‌ర్ల మేర పిఠాపురంలో పాద‌యాత్ర చేసి మంచి జోష్ తీసుకువ‌చ్చారు. అదేవిధంగా వైసీపీపై పోరాడండి అని చంద్ర‌బాబు పిలుపు ఇవ్వ‌గానే ఆయ‌న స్పందించారు. పాద‌యాత్ర స‌మ‌యంలోనే.. కూట‌మి స‌ర్కారు చేస్తున్న ప‌నుల‌ను కూడా వివ‌రించారు.

ఇక‌, ఉమా విష‌యానికి వ‌స్తే మాత్రం ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న అసంతృప్తి ఇంకా త‌గ్గిన‌ట్టు లేద‌ని నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ సాగుతోంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు రెండేళ్లు పూర్తయిన సంద‌ర్భంగా ఆయ‌న ఏ కార్య‌క్ర‌మ‌మూ నిర్వ‌హించ‌లేదు. పోనీ.. చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కు.. మీడియా ముందుకు కూడా రాలేదు. అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆయ‌న క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేశార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. మ‌రి.. ఈ అసంతృప్తి ఎప్ప‌టికి త‌గ్గుతుందో చూడాలి.