'దుబాయ్ వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు'... అవినాష్ క్లారిటీ ఇదే!
మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ పై ఎఫ్.ఐ.ఆర్. నమోదైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Aug 2024 10:02 AM GMTవైసీపీ నేత దేవినేని అవినాష్ గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నిస్తుండగా.. విమానాశ్రయంలో అధికారులు ఆయన్ను అడ్డుకున్నారని.. అనంతరం ఏపీలోని మంగళగిరి పోలీసులకు సమాచారం అందించారని.. ఆయనపై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారిని కోరారని.. దీంతో అవినాష్ వెనక్కి తిరిగి వెళ్లిపోయారని ఉదయం నుంచి మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ పై ఎఫ్.ఐ.ఆర్. నమోదైన సంగతి తెలిసిందే. ఆ దాడిలో పాల్గొన్నవారిపై పోలీసులు ముందస్తు చర్యలు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే దేవినేని అవినాష్ దుబాయ్ కి వెళ్లిపోవాలని ప్రయత్నించారని, పోలీసులు అడ్డుకున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా దేవినేని అవినాష్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
అవును... తాను దుబాయ్ కి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై దేవినేని అవినాష్ స్పందించారు. ఇందులో భాగంగా... ఓ వర్గం మీడియాలోనూ, టీడీపీ సోషల్ మీడియాలోనూ తాను పారిపోవడానికి ప్రయత్నించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. పారిపోవాల్సిన అవసరం కానీ, అంత కర్మ గానీ తనకు లేదని.. అటువంటి అవసరం తనకు లేనే లేదని వెల్లడించారు.
తాను సుమారు రెండు నెలలుగా విజయవాడలోని పార్టీ ఆఫీసులోనూ, తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి 24 గంటలూ అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. నిజంగా తాము తప్పు చేసినట్లు కోర్టు భావించి, ఏ శిక్ష విధించినా ధమ్ముగా స్వీకరిస్తామని తెలిపారు. తప్పుడు కేసులకు బయపడి పారిపోవాల్సిన అవసరం తనకు లేనే లేదని పునరుధ్గాటించారు. తన తండ్రి తనను ధైర్యంతో పెంచారని, అది టీడీపీ సోషల్ మీడియా తెలుసుకోవాలని సూచించారు.
కాగా... వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం తీవ్ర సంచలనం సృష్టించింది. నాటి సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి! ఈ సమయంలో లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లు టీడీపీ ఆరోపించింది.