Begin typing your search above and press return to search.

కీలక నియోజకవర్గంలో జ్వాలలు.. చంద్రబాబుపై దేవినేని స్మిత ఫైర్‌!

కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పెనమలూరు ఒకటి. కమ్మ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గమిది.

By:  Tupaki Desk   |   23 March 2024 9:14 AM GMT
కీలక నియోజకవర్గంలో జ్వాలలు.. చంద్రబాబుపై దేవినేని స్మిత ఫైర్‌!
X

కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పెనమలూరు ఒకటి. కమ్మ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గమిది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉయ్యూరు రద్దయి పెనమలూరు ఏర్పడింది.

2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున కొలుసు పార్థసారధి పెనమలూరు నుంచి విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ గెలుపొందారు. 2019లో పార్థసారధి వైసీపీ నుంచి విజయం సాధించారు.

కాగా వచ్చే ఎన్నికల్లో పార్థసారధికి వైసీపీ అధినేత జగన్‌ సీటు నిరాకరించారు. దీంతో పార్థసారధి టీడీపీ నుంచి నూజివీడు సీటును దక్కించుకున్నారు. టీడీపీ తొలి విడత జాబితాలోనే ఆయనకు సీటు లభించింది.

మరోవైపు పెనమలూరు సీటును వైసీపీ... మంత్రి జోగి రమేశ్‌ కు కేటాయించింది. జోగి రమేశ్‌ ప్రస్తుతం పెడన ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడి నుంచి తప్పించి పెనమలూరు బరిలో దింపింది.

కొలుసు పార్థసారధికి పెనమలూరు టీడీపీ సీటును ఇస్తారని ప్రచారం జరిగింది. దీంతో బోడె ప్రసాద్‌ కు సీటు దక్కదని టాక్‌ నడిచింది. అయితే కొలుసుకు నూజివీడు ఇవ్వడంతో బోడె ప్రసాద్‌ కు అడ్డంకులు తొలగినట్టేనని అంతా భావించారు.

అయితే ట్విస్టుల మీద ట్విస్టులన్నట్టు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరడంతో ఆయన పేరు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా పేరు, విజయవాడ టీడీపీ నేత ఎంకే బేగ్‌ పేరు, తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరు ఇలా అనేక పేర్లు పెనమలూరు సీటుకు వినిపించాయి. ఇలా తర్జనభర్జనల అనంతరం బోడె ప్రసాద్‌ పెనమలూరు సీటును దక్కించుకున్నారు.

అయితే ఇప్పటికే ఉన్న అభ్యర్థులు చాలరన్నట్టు దివంగత టీడీపీ నేత, గతంలో ఉయ్యూరు నుంచి టీడీపీ తరఫున ఒకసారి, ఇండిపెండెంట్‌ గా మరోసారి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత సైతం ఇంటింటికీ తానే అభ్యర్థినంటూ ఉయ్యూరు పట్టణమంతా తిరిగారు. ఆమె తన భర్తతో కలిసి ప్రతి గడప తట్టారు. అయితే చివరకు బోడె ప్రసాద్‌ నే అదృష్టం వరించింది. దీంతో స్మితకు నిరాశ ఎదురైంది.

ఈ నేపథ్యంలో దేవినేని స్మిత... చంద్రబాబు,లోకేష్‌ లపై నిప్పులు చెరిగారు. తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. 2009లో తమ తండ్రి ఓటమికి పార్టీనే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతలే తన తండ్రికి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యకు గురయ్యాక అంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. తన మామగారు చనిపోయిన బాధలో ఉన్నా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టామని దేవినేని స్మిత గుర్తు చేశారు. అయినా 2014, 2019 లోనూ తనకు టిక్కెట్‌ ఇవ్వలేదని విమర్శించారు.

ఈసారి టికెట్‌ ఇస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారని.. చంద్రబాబు, లోకేష్‌ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేసినట్లు దేవినేని సిత్మ వెల్లడించారు. బోడే ప్రసాద్‌ కు ఏవిధంగా సీటిస్తారని ఆమె నిలదీశారు. గ్రౌండ్‌ వర్క్‌ చేసుకునేది తామైతే.. టిక్కెట్లు లాబీయిస్టులకిస్తారా అని ధ్వజమెత్తారు. ఈసారి తమకు టికెట్‌ ఇవ్వాలని రెండేళ్లుగా అడుగుతున్నామన్నారు.

టికెట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారో కనీసం పిలిచి కూడా చంద్రబాబు తమకు చెప్పలేదని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్‌ అపాయింట్‌ మెంట్‌ కోసం ప్రయత్నించినా పట్టించుకోలేదన్నారు. లోకేష్‌కు వాట్సాప్‌ లలో మెసేజ్‌లు పెట్టామన్నారు. అయినా ఇంతవరకు సమాధానం లేదని వాపోయారు. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలోనూ తాము భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. టికెట్‌ లేదంటే బోడే ఏడ్చాడని ఎద్దేవా చేశారు. బ్లాక్‌ మెయిల్‌ చేశాడని మండిపడ్డారు. తాము బోడేలా చేయలేదు కదా.. తమకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా నిలదీశారు?

బోడే ప్రసాద్‌ లాగా బ్లాక్‌ మెయిల్‌ చేసే వారికే చంద్రబాబు టికెట్‌లు ఇస్తారా? అని దేవినేని స్మిత ప్రశ్నించారు. తన వెనుక ఎవరూ లేరని ఆడపిల్లనైన తనను ఏడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. తాము చేసిన తప్పేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విలువలేని పార్టీకోసం తామెందుకు పనిచేయాలన్నారు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం అని దేవినేని స్మిత తెలిపారు.