కీలక నేతకు చంద్రబాబు ఝలక్!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 22 March 2024 9:21 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తోంది. ఈ క్రమంలో మిత్ర పక్షాలు జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ సీట్లను, 8 పార్లమెంటు సీట్లను కేటాయించింది. దీంతో టీడీపీలో కీలక నేతలకు ఈసారి సీట్లు దక్కలేదు. అలాగే వైసీపీ నుంచి పార్టీలో చేరిన నేతలకు కూడా కొన్ని చోట్ల సీట్లు ఇవ్వడం వల్ల ముందు నుంచి టీడీపీలో ఉన్నవారికి సీట్లు కేటాయించలేదు.
ఈ నేపథ్యంలో టీడీపీలో సీనియర్ నేతగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా పేరున్న దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు లభించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 1999, 2004ల్లో దేవినేని ఉమా కృష్ణా జిల్లా నందిగామ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత కృష్ణప్రసాద్ ను, 2004లో వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావును ఉమా ఓడించడం విశేషం.
ఇక 2009లో నందిగామ ఎస్సీ రిజర్వుడ్ గా మారడంతో మైలవరం నుంచి దేవినేని ఉమా పోటీ చేశారు. మరోసారి విజయం సాధించారు. అలాగే 2014లోనూ మైలవరం నుంచి విజయ ఢంకా మోగించారు. మొత్తం ఐదుసార్లు పోటీ చేసిన దేవినేని ఉమా రెండుసార్లు నందిగామ నుంచి, రెండుసార్లు మైలవరం నుంచి విజయం సాధించారు.
తొలిసారి గత ఎన్నికల్లో మైలవరం నుంచి దేవినేని ఉమా ఓటమి పాలయ్యారు.
ఈ నేపథ్యంలో తాజాగా మైలవరం సీటును వైసీపీ నుంచి టీyీ పీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు కేటాయించారు. 1999లో నందిగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత కృష్ణప్రసాద్ పై దేవినేని ఉమా గెలుపొందడం విశేషం. గత ఎన్నికల్లో మాత్రం మైలవరం నుంచి వసంత చేతిలో ఉమా ఓడిపోయారు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికలకు దేవినేని ఉమాకు సీటివ్వని చంద్రబాబు వసంత కృష్ణప్రసాద్ కు సీటు కేటాయించారు. దేవినేని ఉమాను కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేయిస్తారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు దేవినేని ఉమా పేరుతో చంద్రబాబు ఐవీఆర్‌ఎస్ సర్వే కూడా చేశారు. అయితే చివరకు పెనమలూరు సీటును టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి బోడె ప్రసాద్ కే కేటాయించారు. దేవినేని ఉమాకు సీటు లేకుండా పోయింది. టీడీపీ ఇక రాష్ట్రవ్యాప్తంగా కేవలం 5 చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో ఎక్కడా ఉమాకు చోటు దక్కే అవకాశం లేదు.
అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమాకు న్యాయం చేస్తామని ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయనతో మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలు శిరసా పాటిస్తానని.. తనకు సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఇబ్బందేమీ లేదని ఉమా ప్రకటించారు.