ఘోరకలి...తిరుపతి తోపులాటలో ఆరుగురు భక్తుల మృతి
తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలలో భక్తుల మధ్య భారీ ఎత్తున తోపులాట జరిగింది.
By: Tupaki Desk | 8 Jan 2025 5:56 PM GMTవైకుంఠ ద్వారం చూడాలని ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భావించిన భక్తులకు స్వర్గ ద్వారాలే తెరచుకున్నాయి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు భక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ విషాదం ఇపుడు ఆధ్యాత్మిక భూమిలో ఆందోళన కలిగిస్తోంది.
గురువారం వైకుంఠ ద్వార సర్వ దర్శనం కోసం టోకెన్లను టీటీడీ జారీ చేస్తుందని ప్రకటన రావడంతో భక్తులు వెల్లువలా వచ్చారు. దీంతో బుధవారం సాయంత్రం నుంచే భక్తులు అత్యధిక సంఖ్య్లో టోకెన్లు ఇచ్చే కేంద్రాల వద్దకు చేరుకున్నారు.
తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలలో భక్తుల మధ్య భారీ ఎత్తున తోపులాట జరిగింది. గురువారం ఉదయం తిరుపతిలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వారా సర్వ దర్శనం టోకెన్లు ఇస్తారని భావించి ముందు రోజే క్యూ కట్టేశారు. దీంతో తోపులాట జరగడంతో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు మరణించారని తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో అనేక మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వీరి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి కలెక్టర్ టీటీడీ ఈవో చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది అంటే భక్తులు రోడ్ల మీద గుమి గూడకుండా భైరాగి పట్టెడ వద్ద పద్మావతి పార్కులో ఉంచారు.
అయితే టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్తతకు గురి కావడంతో ఆయన కోసం క్యూ లైన్ తెరచారు. అక్కడ పెద్దగా సెక్యూరిటీ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో తొక్కిసలాట జరిగింది. నిజానికి టోకెన్లు ఇస్తారు అని భావించి ఒక్కసారిగా భక్తులు ముందుకు దూకడంతో ఈ ప్రమాదం సంభవించింది. మొత్తానికి ఇది ఘోరమైన ప్రమాదంగా మారింది.