పవన్ వ్యాఖ్యలపై డీజీపీ రియాక్షన్... తెరపైకి ట్రిపుల్ ఆర్ టాపిక్!
ఏపీలో లా అండ్ ఆర్డర్ పై పవన్ చేసిన వ్యాఖ్యలను తాను చాలా పాజిటివ్ గా తీసుకున్నట్లు అనిత తెలిపారు.
By: Tupaki Desk | 5 Nov 2024 12:55 PM GMTఏపీలో శాంతిభద్రతల వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ స్పందించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పై పవన్ చేసిన వ్యాఖ్యలను తాను చాలా పాజిటివ్ గా తీసుకున్నట్లు అనిత తెలిపారు.
తాను చేస్తున్న పనికి పవన్ మరింత సపోర్ట్ చేసినట్లు అయ్యిందని.. తనను ఇంకా దూకుడుగా ముందుకు వెళ్లమని పవన్ సూచించినట్లు అయ్యిందని అనిత తెలిపారు. ఇదే సమయంలో... పవన్ వ్యాఖ్యలను నిందలు మోపినట్లు చూడకుండా, నిర్మాణాత్మక హెచ్చరికగా చూడాలని మంత్రి నారాయణ అన్నారు.
ఇక.. ఏపీలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా ఉందో పవన్ వ్యాఖ్యలను చూస్తే అర్ధం అవుతుందని.. హోంమంత్రి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. ఈ సందర్భంగా... పోలీసులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలని.. తాము చేస్తున్నామని అన్నారు.
ఇదే క్రమంలో... మానవ హక్కులు, చిన్నారులు, మహిళల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని.. ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండేలా పోలీసు వ్యవస్థలో చర్యలు చేపట్టామని.. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తున్నామని.. రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయమని డీజీపీ తెలిపారు. అయితే.. గత ప్రభుత్వంలో తప్పిదాలు అయితే జరిగాయని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా... ఓ పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని.. నేరస్తుల వేలి ముద్రలు గుర్తించే వ్యవస్థను లేకుండా చేశారని.. అయితే.. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా.. లేదా అనేది చూడాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కేసు వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్థావించారు.
ఇందులో భాగంగా... గత ప్రభుత్వ హయాంలో ఒక ఎంపీని కొట్టారన్న ఆరోపణలు వచ్చాయని.. దానిపై నిజానిజాలు తేలలేదని అన్నారు. ఇదే క్రమంలో... ఐజీ సంజయ్ పై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయిస్తోందని.. ఆయనపై విచారణ నివేదిక తొలుత జీఏడీకి వెళ్లిన తర్వాత తమకు వస్తుందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... ఇటీవల సైబర్ క్రైం, సోషల్ మీడియా వేదింపులు ఎక్కువయ్యాయన్న డీజీపీ... వీటిని పూర్తిస్థాయిలో నియంత్రించే హక్కు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాకో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు!