అర్వింద్... ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది అంటున్నారు
తమ వద్ద కూడా అయస్కాంతం ఉందని, దాంతో తప్పక తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అర్వింద్ ఆసక్తికర కామెంట్లు చేశారు.
By: Tupaki Desk | 27 Oct 2023 4:50 PM GMTనిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ నేతల్లో తనదైన ముద్ర వేసుకోవడమే కాకుండా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడంలో ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ఉండే అతికొద్ది మంది నేతల్లో ఒకరనే గుర్తింపు పొందారు. అందుకే ఢిల్లీ పెద్దలు సైతం ఆయన్ను గుర్తించి చిరకాల వాంచ అయిన పసుపు బోర్డు డిమాండ్ నెరవేర్చింది. దీంతో పాటుగా కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటే ఆ మేరకు మొదటి జాబితాలోనే పేరు ప్రకటించింది. ఇంతటి గుర్తింపు పొందిన అర్వింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశంఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ధర్మపురి అర్వింద్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఉత్తర తెలంగాణకు సెంటర్ పాయింట్ కోరుట్ల నియోజకవర్గం అని అన్నారు. పైసా ఖర్చు పెట్టకుండా ఇక్కడ గెలిచి తెలంగాణకే ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతామన్నారు.
తెలంగాణ రాజకీయాలలో మార్పునకు కోరుట్ల నియోజకవర్గం నాంది కాబోతుందని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. కల్వకుంట్ల వారంటే తనకు చాలా ఇష్టమని.. అందుకే కోరుట్లలో కల్వకుంట్ల వారి పని పట్టడానికే నియోజకవర్గానికి వచ్చానని ఆయన సెటైర్లు వేశారు. తమ వద్ద కూడా అయస్కాంతం ఉందని, దాంతో తప్పక తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అర్వింద్ ఆసక్తికర కామెంట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన అర్వింద్ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని చెప్పి.. పదేళ్లు అవుతోందని, ఈ పదేళ్లలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో 31 స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ స్కూళ్లలో సరైన తిండి లేదని, బాలికలకు ప్రత్యేకమైన వాష్రూమ్స్లేని పరిస్థితులు ఉన్నాయన్నారు. రోడ్డు రోలర్ గుర్తుకు, కారు గుర్తుకు తేడా తెలియడానికే కేసీఆర్ కు కంటి వెలుగు కార్యక్రమం ఉపయోగపడుతుందని అర్వింద్ కామెంట్లు చేశారు.