ఆధారాలు మాయమైపోతున్నాయా ?
కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్ధితి చాలా విచిత్రంగా తయారవుతోంది. కేసీయార్ హయాంలో జరిగిన అన్యాయాలు, అవకతవకలపై విచారణ చేయాలంటే అందుకు ఆధారాలు మాయమైపోతున్నాయట.
By: Tupaki Desk | 13 Jan 2024 4:30 PM GMTకాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్ధితి చాలా విచిత్రంగా తయారవుతోంది. కేసీయార్ హయాంలో జరిగిన అన్యాయాలు, అవకతవకలపై విచారణ చేయాలంటే అందుకు ఆధారాలు మాయమైపోతున్నాయట. దాంతో అవకతవకలు జరిగినమాట వాస్తవమే కాని అందుకు సంబంధించిన ఫైళ్ళ కరెస్పాండెన్స్ మాయమైపోయినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన బాగోతాలు బయటపడకుండా అప్పట్లో పనిచేసిన ఉన్నతాధికారుల్లో కొందరు ముందుజాగ్రత్తగా కరెస్సెండెన్స్ ఫైళ్ళని మాయం చేసినట్లు ఇపుడు వెలుగుచూసింది.
కాంగ్రెస్ అప్పటి అవకతవకలపై విచారణ జరిపించినా ఎలాంటి సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్ధమవుతోంది. లేకపోతే కరెస్సాండెన్స్ ఫైళ్ళు మాయమైపోవాల్సిన అవసరంలేదు. ధరణి పోర్టల్ ను అడ్డంపెట్టుకుని అప్పట్లో వేలాది ఎకరాలను అన్యాక్రాంతం చేసినట్లు ఆరోపణలున్నాయి. ధరణిని అడ్డంపెట్టుకుని కేసీయార్ కుటుంబసభ్యులే భారీ అక్రమాలకు పాల్పడినట్లు రేవంత్ అండ్ కో పదేపదే చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే.
ప్రభుత్వ భూములకు సంబంధించిన ఎలాంటి రికార్డులు లేకపోయినా అప్పట్లో కొందరు ఉన్నతాధికారులు చక్రంతిప్పటంతో కోట్లాది రూపాయలు విలువైన వందలు, వేలాది ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల పరమైపోయాయనే ఆరోపణలకు కొదవేలేదు. ధరణిని అడ్డంపెట్టుకుని జరిగిన అక్రమాలన్నీ కేవలం ప్రభుత్వంలోని పెద్దల నోటిమాటమీద మాత్రమే జరిగాయి. నోటిమాట మీద జరిగాయి కాబట్టి సదరు పెద్దలు ఎక్కడా ఇరుక్కోరు. నోటిమాటతో అక్రమాలకు పాల్పడిన ఉన్నతాధికారులకు కూడా అప్పట్లో బాగానే జరుగుబాటైంది. కాబట్టి సీట్లో కూర్చుని వ్యవహారం నడిపింది ఉన్నతాధికారులే కాబట్టి రేవంత్ ప్రభుత్వం జరిపించబోయే విచారణలో తగులుకుంటే తగులుకునేది ఉన్నతాధికారులు మాత్రమే. అందుకనే తమను తాము రక్షించుకునేందుకే సదరు ఉన్నతాధికారులు ధరణిలో జరిగిన అక్రమాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇపుడు వెలుగుచూసింది.
నిజంగా మాట్లాడుకుంటే ఒక ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలను తర్వాత ప్రభుత్వం నిజాయితీతో విచారించటం, బాధ్యులను శిక్షించటం మనదేశంలో జరిగే పనికాదు. ఎవరి ఖర్మో కాలితే తప్ప చట్టానికి, న్యాయానికి ఆధారాలతో సహా దొరకరన్నది వాస్తవం. అందుకనే ప్రభుత్వాల్లో కీలక వ్యక్తులు, ఉన్నతాధికారులు కూడా పదవుల్లో ఉన్నపుడు తమిష్టప్రకారం చెలాయించుకోవటం మామూలైపోయింది. అందుకనే కేసీయార్ పాలనలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళు కూడా హ్యాపీగానే ఉండచ్చు. మరి విచారణలో ఏమి తేలుతుందన్నది చూడాలి.