వైసీపీ సీనియర్ నేత గుస్సా ?
వైసీపీలో నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటాయని అంటారు. అందుకే నేతలు అసంతృప్తితో ఉంటారని చెబుతారు.
By: Tupaki Desk | 21 Jan 2025 4:30 AM GMTవైసీపీలో నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటాయని అంటారు. అందుకే నేతలు అసంతృప్తితో ఉంటారని చెబుతారు. టీడీపీ లాంటి పార్టీలలో కూడా అసంతృప్తులు ఉంటాయి. అయితే పార్టీ అధినాయకత్వం వారికి విషయం వివరించి నచ్చచెప్పి ఆ మీదట చేయాల్సింది చేస్తుంది అని అంటారు.
ఆ రకమైన మెకానిజం వైసీపీలో లేదా అంటే నేతల అలకలు అసంతృప్తులు తీవ్ర నిర్ణయాల దిశగా సాగుతున్నాయి అంటే అదే అనుకోవాలేమో అని అంటున్నారు. ఇక పోతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంచార్జిలను రెండు రోజుల క్రితం వైసీపీ అధినాయకత్వం నియమించింది
ఈ నేపథ్యంలో చోడవరం నుంచి మూడు సార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి 2019లో గెలిచిన సీనియర్ నేత కరణం ధర్మశ్రీని తప్పించడం పట్ల ఆయన వర్గం అసంతృప్తితో రగులుతోంది అని అంటున్నారు. కరణం ధర్మశ్రీ సీనియర్ నేత అని గుర్తు చేస్తున్నారు. ఆయన 2004 లో డాక్టర్ వైఎస్సార్ ప్రోత్సాహంతో మాడుగుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆయన ఓటమి పాలు అయ్యారు. 2014 నాటికి ఆయన వైసీపీలో చేరారు వైఎస్సార్ కుటుంబం పట్ల ఆయన విధేయతతో ఉంటారని చెబుతారు.
ఇదిలా ఉంటే 2019లో నెగ్గిన కరణం ధర్మశ్రీ మంత్రి పదవిని ఆశించారు. కానీ దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురి అయ్యారు. ఆ మీదట ప్రభుత్వ విప్ పదవి దక్కింది ఇకపోతే 2024 ఎన్నికల ముందే ఆయనకు టికెట్ నిరాకరించవచ్చు అన్న చర్చ సాగింది. కానీ చివరి నిముషంలో ఆయనకు టికెట్ ఇచ్చారు.
ఇపుడు చూస్తే ఆయనను అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి పరిశీలకునిగా నియమించారు. చోడవరం వైసీపీ ఇంచార్జిగా గుడివాడ అమర్నాధ్ ని తెచ్చి పెట్టారు. దీంతో కరణం ధర్మశ్రీ వర్గీయులు తమ నాయకుడికి అన్యాయం చేసారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయనకే చోడవరం ఇంచార్జి పదవి ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయితే 2024 ఎన్నికల్లో భారీ తేడాతో కరణం ఓటమి చెందారని అందుకే ఆయన ప్లేస్ లో మార్పు అని అంటున్నారు. మరో వైపు చూస్తే అనకాపల్లి లోక్ సభ పరిశీలకునిగా పదవి తీసుకోవడానికి కరణం ధర్మశ్రీ సుముఖంగా లేరని అంటున్నారు.
వైసీపీలో అయితే నియామకం జరిగిపోయింది. మరి మార్పు అంటే జరిగే పని కాదేమో అని అంటున్నారు. దాంతో కరణం ఏమి చేస్తారు అన్నదే చర్చగా ఉంది. ఆయన కూడా వేరే ఆలోచనలు చేస్తారా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా సీనియర్ నేతలు గుస్సా అయితే పార్టీకి ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు.