Begin typing your search above and press return to search.

ధ‌ర్మాన కూడా అదే దారి.. అందుకే సైలెంట్‌.. !

అయితే.. టీడీపీ, లేక‌పోతే.. జ‌న‌సేన అంటూ.. కూట‌మి పార్టీల్లో ధ‌ర్మాన రాజ‌కీయంపై పెద్ద ఎత్తున చ‌ర్చ అయితే సాగుతోంది.

By:  Tupaki Desk   |   3 Dec 2024 7:40 AM GMT
ధ‌ర్మాన కూడా అదే దారి.. అందుకే సైలెంట్‌.. !
X

రాజ‌కీయాల్లో ఇక ఉండ‌ను.. నాకు-రాజ‌కీయాల‌కు స‌రిపోవ‌డం లేద‌ని ప్ర‌క‌టించి.. నాలుగు మాసాలు కూ డా కాక‌ముందే ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని.. టీడీపీ వైపు చూస్తున్న‌ట్టు వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నా యి. టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ఆయ‌న‌పై క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చ‌ర్చలు పూర్త‌య్యాయ‌ని, ఏ క్ష‌ణంలో అయినా.. నాని సైకిల్ ఎక్కేయొచ్చ‌ని కూడా వార్త‌లు వస్తున్నాయి. వ్య‌క్తిగ తంగా ఇది ఆయ‌న‌కు మంచిదో చెడ్డ‌దో చెప్ప‌లేం కానీ.. రాజ‌కీయాల్లో మాత్రం కామ‌నే.

రాజ‌కీయాల్లో ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఎవ‌రూ చెప్పేప‌రిస్థితిలేదు. సో.. ఆళ్ల నాని కూడా ఆ తానులో ముక్కే కాబ‌ట్టి.. ఆయ‌న నిర్ణ‌యాన్ని ఎవ‌రూ త‌ప్ప‌బ‌ట్ట‌రు. ఇక‌, ఈ కోవ‌లోనే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కూడా ప‌య‌నిస్తున్నార‌నేది ఇప్పుడు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. అయితే.. టీడీపీ, లేక‌పోతే.. జ‌న‌సేన అంటూ.. కూట‌మి పార్టీల్లో ధ‌ర్మాన రాజ‌కీయంపై పెద్ద ఎత్తున చ‌ర్చ అయితే సాగుతోంది. వైసీపీలో మంత్రిగా చేసిన ఆయ‌న ఈ ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

త‌ర్వాత‌.. నుంచి మౌనంగా ఉన్నారు. పార్టీ ఇస్తాన‌న్న శ్రీకాకుళం వైసీపీ ఇంచార్జ్ ప‌ద‌విని కూడా ధ‌ర్మాన తీసుకోలేదు. దీనిపై ఇంకా నానుస్తున్నారు. కానీ, మ‌న‌సులో మాత్రం జంప్ చేయాల‌న్న‌ది స్ప‌ష్టంగా ఉంద‌ని వైసీపీ అధినేత కూడా భావిస్తున్నారు. అయితే.. సామాజికంగా ఆర్థికంగా ఎలా చూసుకున్నా.. ధ‌ర్మాన అంతో ఇంతో బ‌ల‌మైన నాయ‌కుడు కావ‌డంతో వైసీపీ వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. అలాగ‌ని బ్ర‌తిమాల‌డ‌మూ లేదు.

ఈ ప‌రిణామాల‌తో ధ‌ర్మాన‌కు ఒక‌ర‌కంగా రెడ్ కార్పెట్ వేశారు. ఆయ‌న ఎలాంటి నిర్ణ‌య‌మైనా తీసుకునేం దుకు ఓకే అన్న‌ట్టుగా వ్య‌వ‌హారం ఉంది. మ‌రోవైపు ధ‌ర్మానకు ఇప్పుడు రెండే దారులు క‌నిపిస్తున్నాయి. ఉంటే.. రాజ‌కీయంగా వ‌చ్చే నాలుగున్న‌రేళ్లు మౌనంగా ఉండ‌డం. లేక‌పోతే పార్టీ మార్పు. ఈ రెండు త‌ప్పించి ఆయ‌న‌కు మ‌రో మార్గం లేదు. ఎందుకంటే.. వైసీపీలో యాక్టివ్ అయితే.. విశాఖ‌లో భూములు, గ‌నుల‌కు సంబంధించిన కేసులు బ‌య‌ట‌కు వ‌స్తాయి. యాక్టివ్‌గా లేక‌పోతే.. ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కూడా.. జ‌న‌సేన లేదా టీడీపీ వైపు మొగ్గు చూపేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది.