సిక్కోలు దాసన్న సంగతేంటో ?
పోలింగ్ అనంతర సరళి చూస్తే ఆయన ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్థి భగ్గు రమణమూర్తి గట్టి పోటీ ఇచ్చారు అని అర్ధం అవుతోందిట
By: Tupaki Desk | 25 May 2024 4:20 AM GMTజగన్ కి అత్యంత ఇష్టుడు అయిన సిక్కోలు వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ కి ఈసారి రాజకీయ జాతకం కలసి వచ్చిందా లేదా అన్నది అనుచరులను టెన్షన్ పెడుతోంది. నరసన్న పేటలో 2004 నుంచి రాజకీయ ప్రస్థానం మొదలెట్టి ఇప్పటికి నాలుగు సార్లు గెలిచి ఒకసారి ఓడిన ధర్మనా క్రిష్ణ దాస్ అలియాస్ దాసన్నకు ఈ ఎన్నికలు ముచ్చెమటలు పోయించాయని అంటున్నారు.
పోలింగ్ అనంతర సరళి చూస్తే ఆయన ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్థి భగ్గు రమణమూర్తి గట్టి పోటీ ఇచ్చారు అని అర్ధం అవుతోందిట. ఆయన 2014లో ఒకసారి క్రిష్ణ దాస్ మీద గెలిచారు. తిరిగి 2019లో ఓటమి పాలు అయ్యారు. ఈసారి గెలిచి తీరాలని పట్టుదల మీద ఉన్నారు.
ఆయనకు కింజరాపు కుటుంబం నుంచి పూర్తి మద్దతు దక్కించింది. ఈసారి లోపాయికారీ వ్యవహారాలు ఏమీ లేకుడా సైకిల్ ని గెలిపించుకోవాలని గట్టిగానే కింజరాపు కుటుంబం బిగించింది అని అంటున్నారు. దాంతో పాటు వైసీపీలో వర్గ పోరు కూడా తోడు అయి దాసన్న ఇబ్బందిలో పడ్డారు అని అంటున్నారు.
ఆయన వ్యతిరేక వర్గం టీడీపీలో చేరడంతో బలం అక్కడ పెరిగింది. ఇక ధర్మాన కుటుంబానికే ఎపుడూ టికెట్ ఇవ్వడం పట్ల వైసీపీలో ఉన్న వ్యతిరేకతను కూడా టీడీపీ సొమ్ము చేసుకుందని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో భారీ పోలింగ్ అయితే సాగింది. ఈ పోలింగ్ అంతా తమకు అనుకూలం అని రెండు పార్టీలు చెబుతున్నా వైసీపీలో అయితే కొంత చర్చ సాగుతోంది.
తక్కువ ఓట్లతో అయినా దాసన్న బయటపడతారు అని వైసీపీలో అంటున్నారు. ఈసారి గెలవకపోతే రాజకీయంగా కూడా దాసన్నకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. నిజానికి తన కుమారుడు జెడ్పీటీసీ అయిన క్రిష్ణ చైతన్యకు టికెట్ ఇప్పించుకోవాలని ఆయన చూశారు. కానీ జగన్ ఆదేశంతో పోటీ పడ్డారు ఈసారి గెలిస్తే 2029 నాటికి కుమారుడి రాజకీయ వారసత్వం గట్టి పడుతుంది అన్నది ఆయన ఆలోచన.
మొత్తానికి పోలింగ్ ముగిసింది. రిజల్ట్ కి టైం ఉంది. ఈ నేపధ్యం లో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా దాసన్న పాల్గొంటున్నారు. దేవుడి మీదనే భారం వేసినట్లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి సిక్కోలులో ఆసక్తి రేపే హాట్ సీట్లలో నరసన్నపేట ఒకటిగా నిలుస్తోంది. ఈసారి టీడీపీని గెలిపించుకుంటే 2029లో తాను స్వయంగా పోటీకి దిగాలని సిక్కోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రమ్మోహన్ నాయుడు చూస్తున్నారు. అందుకే ఆయన పట్టుదలగా ఇదే సీటు మీద పనిచేశారు అని అంటున్నారు. చూడాలి మరి రిజల్ట్ ఎలా ఉంటుందో.