జగన్ కే ఓటు... సైకిల్ తో షాక్...!
ఏపీ సీఎం ఎవరో తెలుసు. ఆయన ఇస్తున్న పధకాలు కూడా బాగా తెలుసు. వాటిని అందుకుంటున్న వారు మీ ఓటు ఎవరికి అంటే జగన్ బాబుకే అని చెబుతున్నారు
By: Tupaki Desk | 15 Sep 2023 8:38 AM GMTఏపీ సీఎం ఎవరో తెలుసు. ఆయన ఇస్తున్న పధకాలు కూడా బాగా తెలుసు. వాటిని అందుకుంటున్న వారు మీ ఓటు ఎవరికి అంటే జగన్ బాబుకే అని చెబుతున్నారు. అయితే మన గుర్తు ఏమిటి అంటే మాత్రం ఏ మాత్రం తడుముకోకుండా సైకిల్ అని చెప్పేసి షాక్ ఇస్తున్నారు. ఈ ముచ్చట శ్రీకాకుళం జిల్లాలో జరుగుతోంది.
అది కూడా సీనియర్ మంత్రివర్యులు అయిన ధర్మాన ప్రసాదరావు సమక్షంలో జరుగుతోంది. మంత్రి గడప గడపకు మన ప్రభుత్వం అంటూ శ్రీకాకుళంలోని జ్యోతీబా పూలే కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏమమ్మా పధకాలు అందుతున్నాయా అని అందరికీ అడిగారు. మీ ఓటు ఎవరికి అంటే జగన్ బాబుకే అన్నారు.
దాంతో మంత్రి గారి ముఖం వెలిగిపోయింది. ఇంతకీ మన గుర్తు ఏమిటి అని అడగ్గానే అదే జనం నుంచి సైకిల్ అంటూ ఠక్కున జవాబు రావడం మాత్రం మంత్రి గారు జీర్ణించుకోలేనిది అయింది. అంతా బాగా చెప్పి గుర్తు వద్దకు వచ్చేసరికి సైకిలెక్కేసిన కాలనీవాసుల తీరు చూసి మంత్రి అవాక్కయ్యారుట.
అంతే కాదు ఏమీ మాట్లాడలేకపోయారుట. ఆ వెంటనే పార్టీ క్యాడర్ ని పిలిచి గుర్తు గురించి బాగా అవగాహన కల్పించాల్సి ఉందని అంటున్నారు. అర్జంటుగా వైసీపీ గుర్తు మీద ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరడం విశేషం. లేకపోతే లేని పోని ఇబ్బందులు వస్తాయని పార్టీ నాయకులను హెచ్చరించారుట.
అసలు ఇలాంటి ముచ్చట్లు మంత్రిగారి ముందే తరచూ జరుగుతూండడం విశేషం. గతంలో కూడా ఇలాగే ఏవో పధకాలు ఇస్తూ వేదిక మీదకు వచ్చిన ఒక మహిళతో మంత్రి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు అని అడిగితే ఆమె తడుముకోకుండా టీడీపీ అని జవాబు ఇచ్చి ధర్మానను డిఫెన్స్ లో పడేసింది అంటున్నారు.
శ్రీకాకుళం అయితే టీడీపీకి ఒకపుడు కంచుకోట. వైఎస్సార్ ప్రభంజనంలో సైతం మెజారిటీ సీట్లను ఈ జిల్లాలో టీడీపీ గెలుచుకుంది. అయితే ఆ వైభవానికి జగన్ 2019 ఎన్నికల్లో గండి కొట్టారు. మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లు ఉంటే ఎనిమిది సీట్లను గెలుకుని టీడీపీని ఏమీ కాకుండా చేసింది. ఆనాడు వైసీపీ గుర్తు జనాలకు తెలియకపోతే ఇన్ని సీట్లు వచ్చేవి కావు కదా అని కూడా అంటున్నారు.
ఇపుడు మంత్రి గారు స్వయంగా ఎవరికి ఓటేస్తావు అంటూ జనంలోకి వస్తూంటే సైకిల్ టీడీపీ అని జనాలు అంటున్నారు అంటే గుర్తు పార్టీ తెలియకా లేక వారి మనసులో అదే ఉందా అన్నది కూడా వైసీపీలో చర్చకు వస్తోంది. వైసీపీ పెట్టి 12 ఏళ్ళు పై దాటింది. ఎన్నో ఎన్నికలను చూసింది. 2021లో లోకల్ బాడీ ఎన్నికలు కూడా జరిగాయి.
అలాంటిది ఇపుడు కొత్త పార్టీ అయినట్లుగా గుర్తు తెలియకపోవడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ గుర్తుని జనాల మనసులో పెట్టకపోతే ఆసలుకే ఎసరు అన్నది వాస్తవం. మరి ధర్మాన డైరెక్షన్ మేరకు క్యాడర్ ఎలా జనంలోకి గుర్తుకు తీసుకెళ్తారో చూడాల్సి ఉంది.