Begin typing your search above and press return to search.

ధర్మాన ఈ సారి ఎంపీగా?

ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో ధర్మాన మంత్రిగా ఉన్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ దక్కదని సమాచారం.

By:  Tupaki Desk   |   27 Sept 2023 9:00 PM IST
ధర్మాన ఈ సారి ఎంపీగా?
X

వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కదా? ఆయన్ని ఎంపీగా నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో ధర్మాన మంత్రిగా ఉన్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ దక్కదని సమాచారం. తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలో భాగంగా జగన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా తమ పని తీరు మార్చుకోవడం లేదని ఈ సందర్బంగా జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పనితీరు సరిగ్గా లేని, అవినీతి ఆరోపణలు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని జగన్ తెగేసి చెప్పినట్లు సమాచారం.

అలాంటి ఎమ్మెల్యేల 20 నుంచి 30 మంది వరకూ ఉన్నారని జగన్ అన్నారని టాక్. వచ్చే ఎన్నికల్లో వీళ్లకు టికెట్ దక్కదంటూ జగన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ జాబితాలో ధర్మాన ప్రసాదరావు పేరు కూడా ఉందని టాక్.

జగన్ చేయించిన సర్వేల్లో ధర్మాన ప్రసాదరావు వెనకబడి ఉన్నట్లు తేలిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన వరుసగా రెండు సార్లు (2004, 20009) గెలిచారు. కానీ 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.

కానీ ఆ తర్వాత నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులపై ధర్మాన ఫోకస్ పెట్టలేదని సమాచారం. మరోవైపు భూములు ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మూణ్నాలుగు సార్లు చేయించిన సర్వేల్లోనూ ధర్మానకు వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చాయని తెలిసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ధర్మానను తప్పించడం ఖాయమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయన్ని ఎంపీ ఎన్నికల్లో బరిలో దింపే అవకాశం ఉందని టాక్.