Begin typing your search above and press return to search.

వైసీపీ సర్కార్ కి ట్రబులిస్తున్న సీనియర్ మంత్రి...?

సీనియర్ మంత్రిగా ఉత్తరాంధ్రాలో ఉన్న ధర్మాన ప్రసాదరావు తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అని ప్రచారంలో ఉంది

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:42 PM GMT
వైసీపీ సర్కార్ కి ట్రబులిస్తున్న సీనియర్ మంత్రి...?
X

సీనియర్ మంత్రిగా ఉత్తరాంధ్రాలో ఉన్న ధర్మాన ప్రసాదరావు తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అని ప్రచారంలో ఉంది. ఆయన కావాలని చేస్తున్నారా లేక ఆయన మాటలలో అలా అవి టంగ్ స్లిప్ అయి దొర్లుకుంటూ వస్తున్నాయా అన్నది పక్కన పెడితే ధర్మాన మాత్రం ప్రభుత్వాన్ని తనదైన కామెంట్స్ ఇరుకున పెడుతున్నారు అనే అంటున్నారు.

ఆయన ప్రజలతో మాట్లాడుతున్నపుడు సభల్లో తన శైలిని భిన్నగా ఆవిష్కరిస్తారు. ఆయన ఓపెన్ అయినట్లుగా మాట్లాడుతారు. కానీ జనాలతో పంచుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. మరికొన్ని అవసరం లేదు. అలాగే మంత్రిగా సీనియర్ నేతగా ధర్మానకు ఈ విషయాలు తెలియనివి కావు. కానీ ఆయన కొన్ని ఒప్పేసుకున్నట్లుగా చెప్పేస్తున్నారు.

సరిగ్గా అదే వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. పార్వతీపురంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా జరిగిన సభలో ధర్మాన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెరిగాయి అని ఇది నిజమే అని సభలో చెప్పారు. విద్యుత్ వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగిందని, ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల నుంచి కొంటున్నందువల్ల ఆ అదనపు భారాన్ని ప్రజలు భరించక తప్పదు అని మాట్లాడారు.

ఇదే పాయింట్ ఇపుడు విపక్షాలు ఆయుధంగా మారింది అని అంటున్నారు. విద్యుత్ చార్జీలు ఎక్కువ చేశారు అంటూ ఇప్పటికే టీడీపీ ఇతర విపక్షాలు గట్టిగా గోల చేస్తున్నాయి. అది నిజమే అంటూ మంత్రి గారు కూడా చెప్పేస్తే ఇక వారికి కావాల్సింది ఏముంది అని అంటున్నారు.

ఈ ఒక్కటే కాదు విశాఖ పరిపాలనా రాజధానిగా చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అదే విధంగా కర్నూల్ లో న్యాయ రాజధాని అమరావతిలో ఎటూ శాసన రాజధాని ఉంటుందని చెప్పింది. అయితే దీని మీద అతి ఉత్సాహంతో అన్నారో లేక ఉత్తరాంధ్రా మీద ప్రేమతో అన్నారో తెలియదు కానీ మూడు రాజధానులు అని అంటున్నారు కానీ అసలైన రాజధాని మాత్రం విశాఖ మాత్రమే అని ధర్మాన వారు సెలవిచ్చారు.

మిగిలిన రెండూ ఉత్తివే అన్నట్లుగా మాట్లాడారు. ఇది కూడా రాజకీయాల్లో ఎంత కలి పుట్టించాలో అంతా పుట్టించింది. ఇంకో వైపు చూస్తే వాలంటీలు వైసీపీ కార్యకర్తలే అని కూడా ఈ సీనియర్ మంత్రి అన్నారు. వారే వైసీపీని మరోమారు అధికారంలోకి తీసుకుని రావాలని, జగన్ని సీఎం చేయాలని కూడా ధర్మాన అన్నారు.

దాంతో అసలే వాలంటీర్ల వ్యవస్థ మీద మండిపోతున్న విపక్షాలకు ధర్మాన కోరి సాయం చేసినట్లు అయింది అంటున్నారు. ఇక లేటెస్ట్ గా కూడా మంత్రి శ్రీకాకుళంలోని పెదపాడు సభలో మాట్లాడుతూ ప్రజలకు ఎంతో మేలు చేసామని అయినా ఓట్లు అడగబోమని చెప్పేశారు. అంతే కాదు మే నుంచి కొత్త ప్రభుత్వం వస్తే పించన్లు ఉండవని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే మంత్రి గారికే ప్రభుత్వం వస్తుంది అని నమ్మకం లేదా అని అపుడే విపక్షాలు గట్టిగా అటాక్ మొదలెట్టేశాయని అంటున్నారు

ఇదంతా ఎందుకు అన్న చర్చ కూడా వస్తోంది. ఇదిలా ఉంటే ధర్మాన స్టేట్మెంట్స్ మీద వైసీపీ హై కమాండ్ క్లాస్ తీసుకుందని పుకార్లు ఇందుకే వస్తున్నాయని అంటున్నారు. ఇక ధర్మాన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, జగన్ మీద అసంతృప్తిలోనే ఉన్నారని కూడా ప్రచారం సాగుతోంది అంటే అది ధర్మాన మాట తీరు వల్లనే అని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఆయన తన ధోరణి సరి చేసుకుంటారా అన్న చర్చ అయితే సాగుతోంది వైసీపీలో. చూడాలి మరి ఏమి జరుగుతుందో.