ధర్మానలో అసహనం పెరిగిపోతోందా...?
అయితే వైసీపీలో ధర్మాన కంటే ఆయన అన్న ధర్మాన క్రిష్ణదాస్ కే ఎక్కువ ప్రయారిటీ అధినాయకత్వం ఇస్తోంది అన్న బాధ ఆయనకు ఉంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 27 Aug 2023 3:44 AM GMTశ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావులో అసహనం పెరిగిపోతోందా అంటే అవును అనే జవాబు వస్తోంది. ఆయన సభలలో మాట్లాడున్నపుడు ఒక్కోసారి ఎందుకో ఆవేశానికి కూడా లోను అవుతున్నారు. నేను మంచివాడిని అని మంత్రిగారు చెప్పుకోవడం వరకూ ఓకే. కానీ తనను భూములు దోచుకున్నారని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేయడం కాదు తన క్యారెక్టర్ గురించి గట్టిగా చెప్పుకున్నారు.
తాజాగా శ్రీకాకుళంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం సభలో మంత్రి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, తన క్యారెక్టర్ గురించి ఎవరూ వంక పెట్టలేరని అంటున్నారు. తనను విమర్శించే వారు తన నోరు మూయించాలని అనుకుంటే అది కుదిరేది కాదని, తాను బెదిరే రకం అంతకంటే కానని ఆయన హెచ్చరిస్తున్నారు.
తాను ధర్మబద్ధంగా పనిచేస్తున్నాను అని మంత్రి అంటున్నారు. దానిని తప్పు అంటున్నారని మండిపడ్డారు. తాను ఎవరేమనుకున్నా ప్రజల తరఫున మాట్లాడుతుంటానని, ప్రజల గొంతుకనే వినిపిస్తూంటానని ఆయన అంటున్నారు. తన క్యారెక్టర్ ఏంటో విమర్శించే వారు కాదని, ప్రజలు తన సన్నిహితులే చెబుతారు అని ఆయన అంటున్నారు.
మొత్తం మీద చూస్తే ధర్మాన హెచ్చరిస్తున్నది విపక్షాలనా లేక స్వపక్షంలో విపషంగా ఉన్న వారి మీదనా అన్న చర్చ మొదలైంది. ఇక శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ధర్మాన సీనియర్ మోస్ట్ లీడర్. అంతే కాదు వైసీపీలో ఇపుడు ఉత్తరాంధ్రాలో ఉన్న వారి కంటే కూడా సీనియర్. గట్టిగా మూడు పదుల వయసు రాకముందే మంత్రిగా పనిచేసిన చరిత్ర ఆయనకు ఉంది. అంతే కాదు శ్రీకాకుళం జిల్లాలో ఇంత సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన హిస్టరీ కూడా ఆయనకే దక్కుతుంది.
అయితే వైసీపీలో ధర్మాన కంటే ఆయన అన్న ధర్మాన క్రిష్ణదాస్ కే ఎక్కువ ప్రయారిటీ అధినాయకత్వం ఇస్తోంది అన్న బాధ ఆయనకు ఉంది అని అంటున్నారు. అలాగే పక్క జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణను శ్రీకాకుళం జిల్లా పార్టీ వ్యవహారాలు అప్పగించారు. ఇంచార్జి మంత్రిగానూ ఆయన ఉన్నారు.
దాంతో ధర్మానకు ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. ఇక ధర్మాన ప్రసాదరావు ఈ దఫాతో రిటైర్ అయి తన కుమారుడికి శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే అధినాయకత్వం మాత్రం కాదూ కుదరదు అని అంటోంది. దాంతో కూడా ఆయనకు చికాకుగా ఉంది అంటున్నారు. ఇంతటి సీనియర్ అయిన తాను టికెట్ తన ఫ్యామిలీకి తెప్పించుకోకపోవడం ఏంటి అన్న బాధ ఆయనకు పట్టుకుంది అని అంటున్నారు.
ఇక ధర్మాన చాలా సందర్భాలలో బోల్డ్ గా మాట్లాడేసి అధినాయకత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అని అంటారు. ఆయన మూడు రాజధానులు కాదు అది జస్ట్ ఊరకే వన్ అండ్ ఓన్లీ విశాఖే రాజధాని అంటూ ఆ మధ్య చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. అలాగే ఆయన సొంత పార్టీ మీద ప్రభుత్వం మీద కూడా అపుడపుడు సెటైర్లు పేలుస్తూంటారు. దీంతోనే ఆయన తాను ఇబ్బంది పడుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు.
ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ధర్మానలో అసహనం ఎందుకు పెరిగిపోతోంది అన్న చర్చ కూడా వస్తోంది. శ్రీకాకుళం లో 2019లో వర్గ పోరుతో టీడీపీ ఓడినా ఇపుడు ఆ పార్టీలో అంతా ఐక్యంగా పనిచేస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికలు టఫ్ గా ఉంటాయన్న ఫీలింగ్ సైతం మంత్రి గారిలో అసహనం పెంచుతోంది అని అంటున్నారు. మొత్తానికి ధర్మం చెబుతాను అంటూ ధర్మరాజులా ఉంటే కుదిరే కాలం కాదు కదా సారూ అని సొంత వారే పెద్దాయనకు చెప్పాల్సి వస్తోందిట.