రాజకీయాలకు నమస్కారం పెట్టబోతున్న ధర్మాన ?
నాలుగు పదుల రాజకీయ అనుభవం కలిగిన ధర్మాన ఒక కొత్త నేత సర్పంచ్ నుంచి నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన గోండు శంకర్ చేతిలో ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 2 Aug 2024 4:17 AM GMTఆయన ఇంటి పేరులోనే ధర్మం ఉంది. ఆయన కూడా అలాగే ఉంటారు. విమర్శలు చేయాలని ఎపుడూ చేయరు. ఆ విమర్సలలోనూ సహేతుకత ఉంటుంది. ఆయనే శ్రీకాకుళానికి చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన సబ్జెక్టు మీదనే ఎపుడూ మాట్లాడుతారు. ఆయన అసెంబ్లీలో అప్పట్లో మూడు రాజధానులు ఆవశ్యకత గురించి అధికార వికేంద్రీకరణ గురించి చెబుతూ అమరావతి ఏ విధంగా అందరి రాజధానిగా ఉండలేదో చేసిన సుదీర్ఘమైన ప్రసంగం అందరికీ ఆకట్టుకుంది.
ఆనాటి విపక్షంలోని టీడీపీ వారు సైతం ఆసక్తిగా విన్నారు. మొత్తం ఏపీ సొమ్ముని అంతా తెచ్చి ఒకే చోట కుప్ప పోస్తే వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమల సంగతేంటి అని ఆయన అప్పట్లోనే ప్రశ్నించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ధర్మానకు మొదటి విడతలో జగన్ మంత్రిగా చాన్స్ ఇవ్వకపోయినా రెండవ విడతలో రెవెన్యూ మంత్రిగా అవకాశం ఇచ్చారు.
ఆయన రెండేళ్ల పాటు ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఇక సొంత పార్టీలో ఉన్నా ఆయన తప్పు జరిగితే ఒప్పుకునే వారు కాదు, ఆయన శ్రీకాకుళంలోనూ భూకబ్జాలకు కొంతమంది పాల్పడుతున్నారు అని తమ ప్రభుత్వం ఉండగానే విమర్శలు చేసి సంచలనం రేపారు. ఇక మంత్రిగా తాను ఎన్నో సార్లు పనిచేసానని ఈసారి పోటీ చేయను రాజకీయాలకు స్వస్తి అని ధర్మాన 2024 కి ముందే చెప్పారు.
ఎన్నికల వేళ కూడా ఆయన తనను జగన్ ఒత్తిడి చేసి పోటీ చేయమని కోరుతున్నారని తాను బలవంతంగానే పోటీ చేస్తున్నట్లుగా చెప్పారు. ఈసారి గెలవడానికి ఆయన చాలా కష్టపడ్డారు కనీ టీడీపీ కూటమి ప్రభంజనంలో ఓటమి పాలు అయ్యారు.
దీంతో గత రెండు మూడు నెలలుగా మౌనంగా ఉంటూ వచ్చిన ధర్మాన ఇపుడు ఒక కఠినమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఏకంగా రాజకీయాలకే నమస్కారం పెట్టబోతున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. నాలుగు పదుల రాజకీయ అనుభవం కలిగిన ధర్మాన ఒక కొత్త నేత సర్పంచ్ నుంచి నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన గోండు శంకర్ చేతిలో ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయన ఓటమి కూడా దారుణంగా ఉంది అని అంటున్నారు. జిల్లాలోనే అత్యధిక మెజారిటీ గా శ్రీకాకుళం నుంచి గోడు శంకర్ విజయం నమోదు అయింది. ఏకంగా 52 వేల పై చిలుకు మెజారిటీతో శంకర్ గెలిచారు.
దాంతో ధర్మాన ఇక తాను రాజకీయాల్లో ఉండడం దండుగ అని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కొన్ని సామాజిక వర్గాలకు వారు కోరిన విధంగా పనిచేసి డిమాండ్లు నెరవేర్చినా ఎన్నికల వేళ అంతా పూర్తిగా హ్యాండ్ ఇచ్చారు అన్న బాధ కూడా ఆయనలో ఉందని అంటున్నారు.
పార్టీ ఓడిన తరువాత జగన్ నిర్వహించిన సమీక్షకు తాడేపల్లి వచ్చిన తరువాత ధర్మాన ఫుల్ సైలెంట్ అయ్యారు. ఆయన ఒక శుభ ముహూర్తాన తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతూ కీలక సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. సో ఏమి జరుగుతుందో చూడాల్సిందే. ధర్మాన తప్పుకుంటే కనుక ఒక సీనియర్ మోస్ట్ లీడర్ రాజకీయంగా తెర వెనక్కి వెళ్ళినట్లే.