కేసీఆర్‌కు సవాల్.. రెచ్చిపోయిన ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్ రెచ్చిపోయారు
By: Tupaki Desk | 10 Aug 2023 8:31 AM GMTనిజామాబాద్ ఎంపీ, బీజేపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్ రెచ్చిపోయారు. ఇటీవల కొంత సైలెంట్ అయిన ఆయన తాజాగా మారోసారి మీడియా ముందుకు వచ్చారు. వచ్చీరావడంతో ఆయన నేరుగా సీఎం కేసీఆర్ పైనే బాణాలు ఎక్కుపెట్టారు. అంతేకాదు.. కేసీఆర్ కుటుంబపైనా ఆయన విమర్శలు చేశారు. దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో.. అంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తనపై సీఎం కేసీఆర్ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని ధర్మపురి అర్వింద్ సవాల్ చేశారు. ఢిల్లీలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చేసేవన్నీ.. మాట్లాడేవన్నీ.. ఓటు బ్యాంకు రాజకీయాలేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తెలిసే.. ఖజానాను ఖాళీ చేస్తున్నారని.. తన వారికి పథకాల రూపంలో ఓట్ల నగదు పంచుతున్నారని విమర్శలు గుప్పించారు.
ఇదేసమయంలో మంత్రి కేటీఆర్‌పైనా అర్వింద్ విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ నిజామాబాద్‌లో మోసపూరిత వాగ్ధానాలు చేశారన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తానన్నారు. కేసీఆర్ కొడుకు అనేది మాత్రమే కేటీఆర్ అర్హత అని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ బడ్జెట్ అంతా కేసీఆర్ తన కుమార్తె కవితకు అప్పజెప్పారని, దీంతో మిషన్ కాకతీయలో అవినీతి వరద పారుతోందని దుయ్యబట్టారు.