బీజేపీలోకి రేవంత్.. వస్తానంటే వద్దంటానా!
ఈ నేపథ్యంలో రేవంత్ బీజేపీలోకి వస్తానంటే సాదరంగా స్వాగతిస్తామని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి
By: Tupaki Desk | 15 April 2024 1:30 PM GMTబీజేపీలోకి రేవంత్.. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న చర్చ దీని గురించే. గత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ బీజేపీలో చేరతారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తరచుగా చెబుతున్నారు. కాంగ్రెస్‌ను మోసం చేసి రేవంత్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. హరీష్ రావు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ బీజేపీలోకి వస్తానంటే సాదరంగా స్వాగతిస్తామని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ పాలనను బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ ఈ సమయంలోనే రేవంత్‌పై అర్వింద్‌కు ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూనే రేవంత్‌ను మాత్రం అర్వింద్ వెనకేసుకొచ్చారు. రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అర్వింద్ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ అభ్యర్థులు దొరకకపోవడంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను నిలబెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో రేవంత్ మాత్రం అసమర్థుడు కాదని అర్వింద్ వ్యాఖ్యానించడం విశేషం. రేవంత్ అసమర్థుడు కాదు కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వమని ఆయన విమర్శించారు.
అంతే కాకుండా కాంగ్రెస్‌లో రేవంత్ ఉంటే అసమర్థుడిగా మారతారని కూడా అర్వింద్ పేర్కొన్నారు. రేవంత్ బీజేపీలో చేరతానంటే ఓ మిత్రుడిగా స్వాగతిస్తానని చెప్పారు. అధిష్ఠానానికి సిఫార్సు చేసి మరీ పార్టీలో చేరేలా చూస్తానని అర్వింద్ చెప్పడం గమనార్హం. అంతే బాగానే ఉంది కానీ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చెబుతున్నట్లు బీజేపీలో చేరే అవసరం రేవంత్‌కు ఏముందన్నదే ఇక్కడ ప్రశ్న. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆయన గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడై.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు సీఎంగా ఉన్నారు. హైకమాండ్ నుంచి రేవంత్‌కు ఫుల్ సపోర్ట్ ఉంది. సీఎం పదవి ఉంది. ఇంకా దేని కోసం ఆయన బీజేపీలో చేరాల్సిన అవసరం ఉందో కేటీఆర్, అర్వింద్‌కే తెలియాలి.