నల్ల డబ్బుపై నాడు ట్వీట్ చేసి.. నేడు అంతులేని నల్ల ధనంతో
గత కొద్ది రోజులుగా జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం.. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ వద్ద పట్టుబడిన నగదు
By: Tupaki Desk | 11 Dec 2023 10:49 AM GMTభారత దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత సంచలనం సందర్భాలు ఏవంటే.. ఒకటి ఆర్థిక సంస్కరణలు.. రెండోది పెద్ద నోట్ల రద్దు.. మొదటి సందర్భంలో దేశ గతే మారిపోయిందని చెప్పకతప్పదు. ఇప్పుడు మనం చూస్తున్న అనేక సౌకర్యాలు ఆర్థిక సంస్కరణల కారణంగా వచ్చినవే అంటే అతిశయోక్తి కాదేమో? ఇక పెద్ద నోట్ల రద్దు నల్ల ధనంపై పాశుపతాస్త్రంగా భావించినా.. దాని ఫలితాలు ఏమిటన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే, నల్ల ధనంపై ఒకనాడు ట్వీట్ చేసిన నాయకుడే నేడు అంతులేని నల్ల ధనం వెనుక ఉన్నట్లుగా కథనాలు వస్తుండడమే ఇక్కడ విశేషం.
గత కొద్ది రోజులుగా జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం.. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ వద్ద పట్టుబడిన నగదు. ఒడిశా ప్రధాన కేంద్రంగా సాహు కుటుంబం డిస్టిలరీ కంపెనీ నిర్వహిస్తోంది. దీనిపై ఆదాయ పన్ను విభాగం అధికారులు దాడులు చేపట్టారు. దీంతో పుట్టలోంచి పాటలు వచ్చినట్లుగా రూ.వందల కోట్లు బయటపడ్డాయి. 5 రోజులుగా 50 మంది బ్యాంకు అధికారులు 40 కౌంటింగ్ మెషిన్లతో నోట్ల గుట్టలను లెక్కించాల్సి వచ్చింది. తొలుత వంద కోట్లు.. తర్వాత రెండొందల కోట్లు.. ఇప్పుడు మూడొందల కోట్లు దాటింది. ఇప్పటికి రూ.353 కోట్ల లెక్క తేలింది. ప్రస్తుతం కౌంటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చిందని ఐటీ అధికారులు తెలిపారు. మొత్తం 176 బ్యాగుల్లో 140 పైగా బ్యాగుల్లోని నగదు కౌంటింగ్ పూర్తయింది. మిగిలిన నగదును ఈ రోజు లెక్కించనున్నారు. అది కూడా పూర్తయితే ఎక్కడికి వెళ్తుందో చూడాల్సి ఉంది. కాగా, దేశంలో ఒక దర్యాప్తు సంస్థ చేపట్టిన సోదాల్లో ఇప్పటివరకు పట్టుబడిన పెద్ద మొత్తం నగదు ఇదే. ఈ నేపథ్యంలో ధీరజ్ కుమార్ సాహూ వ్యవహారం చర్చనీయాంశమైంది. అతడి గతం తవ్వి తీస్తే.. నల్ల డబ్బుకు వ్యతిరేకంగా ధీరజ్ కుమార్ ట్వీట్ చేసినట్లు తెలిసింది.
సరిగ్గా ఏడేళ్ల కిందట 2016లో ప్రధాని మోదీ అనూహ్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో దేశం యావత్ ఆశ్చర్యపోయింది. ఇలాంటి సమయంలో అవినీతికి వ్యతిరేకంగా ధీరజ్ ట్వీట్ చేశారు. ఇప్పుడది వైరల్ గా మారింది. సరిగ్గా అప్పుడు ఏమన్నాడంటే..'డీమానిటైజేషన్ తర్వాత కూడా దేశంలో నల్లధనం, అవినీతిని చూస్తుంటే నా హృదయం బరువెక్కుతోంది. అంత నల్లడబ్బు ఎలా ఒకదగ్గర పోగుపడుతుందో నాకు అర్థం కావడం లేదు. దేశంలో అవినీతిని పారదోలేది కాంగ్రెస్ మాత్రమే' అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
అన్నీ ఆయనకు వర్తించేవే..
నాడు ధీరజ్ కుమార్ సాహూ చేసిన ట్వీట్ అచ్చం ప్రస్తుతం అతడికే వర్తిస్తుండడం గమనార్హం. నల్లధనం, అవినీతి అనే పదాలను ధీరజ్ వాడడం.. నల్ల డబ్బు ఒకే దగ్గర పోగుపడడం అంటూ ఆవేదన వ్యక్తం చేయడం చూస్తుంటే మున్ముందు తాను ఎదుర్కొనబోయే పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. కాగా, నాటి ధీరజ్ ట్వీట్ ను బీజేపీ నేత అమిత్ మాలవీయ రీట్వీట్ చేశారు. 'ధీరజ్ ప్రసాద్ సాహుకు మంచి హాస్య చతురత ఉంది' అంటూ ఎద్దేవా చేశారు.