ఎన్నికల వేళ బీజేపీకి కొత్త సమస్య.. ధృవ్ రాతీ వీడియో వైరల్!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 May 2024 5:35 AM GMTదేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానపార్టీలన్నీ ప్రచారలతో హోరెత్తించేస్తున్నాయి. ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాతీ చేస్తున్న వినూత్న వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలో అతడు తాజాగా వదిలిన ఒక వీడియో బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తుందని అంటున్నారు!
అవును... సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ధృవ్ రాతీ... సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించిన అత్యంత కీలక పాయింట్లతో వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు! ప్రస్తుతం ఒకవర్గం మీడియా అంతా ఆయా పార్టీలకు కరపత్రాలుగా మారిపోతున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో... ధృవ్ రాతీ చేస్తోన్న వీడియోలు మరోవర్గానికి అస్త్రంగా మారుతున్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి వ్యతిరేక విపక్ష నేతలు, వారి వారి స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాల కంటే యూట్యూబ్ వేదికగా ధృవ్ రాతీ చేస్తోన్న వీడియోలే క్షణాల్లో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది! దీంతో... ఇతని వీడియోలు బీజేపీకి ముచ్చెమట్లు పట్టిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా "ఒక నియంత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని మీకు తెలుసా..?" అంటూ వదిలిన వీడియో తీవ్ర కలకలం రేపుతోంది.
ఇందులో భాగంగా... 1933లో హిట్లర్, నాజీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి తన సొంత పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టాడని మొదలుపెట్టీ ధృత్ రాతీ... 1999లో పుతిన్ సైతం తన సొంత దేశ పౌరులపై బాంబు పేలుళ్లకు కారణమయ్యాడని ఆరోపించారు. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు నియంతలు చేసే ఆలోచనలే ఇవన్నీ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు!
అలా మొదలుపెట్టిన ధృవ్ రాతీ... ఇండియాలోనూ అవే తరహ పరిస్థితులు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. ఇందుకు ఉదాహరణగా... పుల్వామా అటాక్ దాడిని ప్రస్థావించాడు. అది కూడా పైన చెప్పుకున్నట్లు బీజేపీ అధికారం కోసం చేసిన చర్యగానే ఆరోపింంచాడు. హిట్లర్, పుతిన్ తరహలోనే మోడీ కూడా అధికారం కోసం దుశ్చర్యలకు తెగబడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు!
కాగా... 29 ఏళ్ల ధృవ్ రాతీ... డిజిటల్ స్పేస్ లో సుపరిచితుడనే సంగతి తెలిసిందే! 2016 ఉరీ దాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, మోర్బీ బ్రిడ్జ్ కూలిపోవడం, 2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస లాంటి అంశాలపై అతని వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి!