Begin typing your search above and press return to search.

తొలకరి మొదలు .. వజ్రాల వేట షురూ !

కానీ ఇక్కడ నాలుగు చినుకులు పడితే చాలు మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బయటకు వస్తాయి.

By:  Tupaki Desk   |   19 May 2024 5:22 PM IST
తొలకరి మొదలు .. వజ్రాల వేట షురూ !
X

'తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లు' రుతుపవనాలు ఈసారి ముందే పలకరించాయి. దీంతో సీమ జిల్లాలలో వజ్రాల వేట మొదలయింది. సాధారణంగా వర్షం పడితే మంచి మట్టి వాసన రావడం సహజం. కానీ ఇక్కడ నాలుగు చినుకులు పడితే చాలు మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బయటకు వస్తాయి.

సాధార‌ణంగా జూన్‌, జూలై మాసాల్లో వ‌ర్షాలు ప‌డుతుంటాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే తొలకరి చినుకులు పలకరించాయి. దీంతో మే నెల మధ్యలోనే వ‌జ్రాల కోసం వేట ప్రారంభించారు. క‌ర్నూలు జిల్లా తుగ్గిలి, జొన్నగిరి, అనంత‌పురం జిల్లా వ‌జ్రక‌రూరులో వ‌జ్రాల కోసం అప్పుడే వేట మొద‌లైంది.

ఈ ప్రాంతాలతో పాటు ఎమ్మిగనూరు, కోసిగిలోని పంట పొలాలలో కూడా వజ్రాలు లభిస్తూ ఉంటాయి. చిన్న రాయి దొరికినా చాలు త‌మ జీవితాలు మారిపోతాయ‌నే ఆశ‌తో జ‌నాలు పొలాలను జ‌ల్లెడ ప‌డుతున్నారు.

తుగ్గిలి, వ‌జ్రక‌రూరు పొలాల్లో స్థానికుల‌తో పాటు స‌మీపంలోని క‌ర్నూలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజ‌లు వచ్చి వజ్రాల వేట మొదలుపెట్టారు. గ‌తంలో చాలా మందికి వ‌జ్రాలు దొరికి కష్టాలు పోగొట్టుకుని కోటీశ్వరులు అయిన సంధర్బాలున్నాయి. అందుకే ఈసారి కూడా చాలా మంది వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు.