Begin typing your search above and press return to search.

ర్యాలీ చేయలేదనే బన్నీ.. ఆ వీడియోలకు ఏమని బదులిస్తారు?

పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా తాను ర్యాలీ చేశానని చెబుతున్న దానిపై అల్లు అర్జున్ రియాక్టు కావటం.. ప్రెస్ మీట్ పెట్టేసి మరీ..

By:  Tupaki Desk   |   22 Dec 2024 4:45 AM GMT
ర్యాలీ చేయలేదనే బన్నీ.. ఆ వీడియోలకు ఏమని బదులిస్తారు?
X

పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా తాను ర్యాలీ చేశానని చెబుతున్న దానిపై అల్లు అర్జున్ రియాక్టు కావటం.. ప్రెస్ మీట్ పెట్టేసి మరీ.. తనను విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ కు కౌంటర్ ఇవ్వటం ద్వారా ఈ ఇష్యూను మరో లెవల్ కు తీసుకెళ్లారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. బెనిఫిట్ షో లేదంటే ఫ్యాన్స్ షో.. పేరు ఏదైనా కానీ.. సినిమా విడుదల తేదీ కంటే కొన్ని గంటల ముందు ప్రదర్శించే ఈ షోకు మూడు కార్ల లో వేర్వేరుగా వచ్చారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో స్పష్టమవుతోంది.

థియేటర్ కు చేరుకున్న మూడో కారు బన్నీదే. అయితే.. తన కారును మెట్రో స్టేషన వద్దఆపి.. అక్కడి నుంచి కారు బయటకు వచ్చి అభివాదం చేయటం.. పుష్ప మూవీలో తగ్గేదేలే అన్న స్టైల్ ను ప్రదర్శించటం.. అభిమానులకు ముద్దులు ఇవ్వటం.. చేతులు ఊపటం లాంటివన్నీ చేశారు. ఓకే.. అది కూడా తప్పు కాదనే అనుకుందాం. ఎందుకుంటే.. తన విలేకరుల సమావేశంలో తాను చేసిన పనిని అల్లు అర్జున్ సమర్థించుకోవటం.. తాను బయటకు వచ్చిన కారణం కేవలం అక్కడున్న వేలాది మందిని కంట్రోల్ చేయటానికేనని.

అందులో భాగంగానే తాను బయటకు వచ్చానని.. తాను అందరిని ముందుకు వెళ్లమని చెప్పానే తప్పించి.. ఇంకేమీ చేయలేదని.. తనదైన ‘ఫ్లో’లో చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ప్రెస్ మీట్ కు ముందే తన ఫ్లో గురించి.. అతను చెప్పే మాటలన్ని రాసుకోవటానికి.. రికార్డుచేసుకోవటానికి వచ్చినోళ్లంతా గమ్ముగా ఉండాలని.. ఎందుకంటే తన ఫ్లో మిస్ అయ్యే వీలు ఉంటుంది కాబట్టి.. తనను ఏమీ అడగొద్దని రిక్వెస్టు పేరుతో పదే పదే స్పష్టం చేయటం తెలిసిందే.

బన్నీ చెప్పిందే నిజమని అనుకుందాం.. తాను చేతులు ఊపింది మొత్తం.. అక్కడ చేరిన వేలాదిమందిని ముందుకు కదలమని చెప్పటమే అయితే.. వైరల్ వీడియోల్లో ఆయన హావభావాలు ఆయన ‘ఫ్లో’ మాటలకు భిన్నంగా ఉండటం ఏమిటి? అన్నది ప్రశ్న. అది కూడా తప్పు కాదనే అనుకుందాం. మరి.. మెట్రో స్టేషన్ నుంచి సంధ్య థియేటర్ వరకు ఉన్న దూరం ఎంత? అన్న ప్రశ్నకు బన్నీ బదులిస్తారా?

ఒక పేరున్న ప్రముఖుడు వస్తున్నాడంటే.. అతడ్ని చూసేందుకు జనాలు ఎగబడటం తెలిసిందే. అలా ఎగబడే అభిమానులకు ఏమీ కాకూడదన్న కనీస జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. మరి.. జనాల్ని కంట్రోల్ చేయటానికి అల్లు అర్జున్ అండ్ కో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలీసులకు సమాచారం ఇచ్చాం.. అంతా వాళ్లే చూసుకోవాలన్నదే నిజమైతే.. మరీ.. అంత మంది బౌన్సర్లను తనతో తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి? బౌన్సర్లు ఎలా కవర్ చేస్తారు? వారి దూకుడు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

‘ర్యాలీ చేయలేదు’ అన్న మాటను పదే పదే చెబుతున్న అల్లు అర్జున్ నిజమే చెబుతున్నారనే అనుకుందాం. మరి.. ఆయన చేసిన దానిని ఏమని పిలవాలి? థియేటర్ లోకి కారు వెళ్లనివ్వకుండా అభిమానులు అడ్డు పడి ఉంటే.. బయటకు వచ్చి ముందుకు కదలాలి? అనే మాట చెప్పటాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే పని చేస్తే ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పిన మాటలు ఇట్టే అతికి పోతాయి. కానీ.. సంధ్య థియేటర్ కు.. మెట్రో స్టేషన్ కు మధ్యనున్న దూరాన్ని చూసినప్పుడు.. దాన్ని అధికారికంగా ర్యాలీ అనలేం కానీ అనధికారంగా మాత్రం ర్యాలీ అనకుండా ఉండగలరా? అన్నది ప్రశ్న. అయినా.. అంత ఫ్లోలో చెప్పేసిన బన్నీ మాటలే నిజమని అనుకోవాలి. ఎందుకంటే.. ప్రశ్నలు వస్తే.. సమాధానం వస్తుంది. అలాంటిది ప్రశ్నలు వేయనివ్వకుండా ఉన్నప్పుడు అక్కడ ఒకరి మాటే ఉంటుంది. అది బన్నీదే అవుతుంది. అలాంటప్పుడు అల్లు అర్జున్ ర్యాలీ చేశారని ఎలా చెబుతారు చెప్పండి?