Begin typing your search above and press return to search.

ఈ ఫార్ములా విచారణ.. రూ.41 కోట్లు బాండ్లు ఎందుకిచ్చారు?

ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కావటం.. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Jan 2025 4:30 AM GMT
ఈ ఫార్ములా విచారణ.. రూ.41 కోట్లు బాండ్లు ఎందుకిచ్చారు?
X

సంచలనంగా మారిన ఈ కారు రేసు వ్యవహారంపై ఏసీబీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కావటం.. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఫార్ములా ఈ -కారు రేసుకు ప్రమోటర్ గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. వీరిలో సంస్థ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఇంతకూ ఎఫ్‌ఈఓ, ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ మధ్యనున్న ఒప్పందం విషయానికి వస్తే.. ప్రమోటర్ గా ఉంటూ 9-12 సెషన్లకు సంబంధించిన ఫీజును ఎఫ్ ఈవోకు వాయిదాల రూపంలో చెల్లించాలి. బ్రిటన్ కు చెందిన ఏఫ్ఈవోతో అప్పటి మంత్రి కేటీఆర్ తొలిదఫా చర్యలు జరిపిన తర్వాత.. హఠాత్తుగా ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, ఏస్‌ రేస్‌ కంపెనీలను 2022 జూలైలో రిజిస్ట్రేషన్‌ చేయించటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కంపెనీల రిజిస్ట్రేషన్ కు పదిహేను రోజులకు ముందే బీఆర్ఎస్ పార్టీకి ఏస్‌ నెక్స్ట్‌జెన్‌, ఏస్‌ రేస్‌ కంపెనీల మాతృసంస్థ గ్రీన్కో నుంచి రూ.10 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు రావటం సందేహాలకు తెర తీసింది. దీనికి 2 నెలల ముందే గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ కు రూ.31 కోట్ల భారీ మొత్తం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందాయి. అయితే.. తొమ్మిదో సెషన్ పూర్తయినతర్వాత పదో సెషన్ ప్రారంభానికి ముందే డీల్ నుంచి ఏస్ నెక్ట్స్‌జెన్‌ బయటకు వచ్చేసింది. వీటిపై ఏసీబీ ఫోకస్ చేసింది.

తాజాగా విచారణకు హాజరైన వారిని అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. వారికి ఎదురైన ప్రశ్నల్లో ముఖ్యమైనవి చూస్తే..

- క్రీడల్లో ఏ మాత్రం అనుభవం లేని మీ కంపెనీ ఇందులోకి ఎందుకు దిగింది?

- మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు?

- మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు?

- ఒప్పందానికి ముందే బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలోరూ.41 కోట్ల భారీ మొత్తాన్ని ఎందుకు ఇచ్చారు?

- రేసు ద్వారా మీ కంపెనీకి లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా?

- ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ రెండో సెషన్ పూర్తి చేయకుండా ఎందుకు వైదొలిగారు?

- మాజీ మంత్రి కేటీఆర్ తో ఉన్న సంబంధం ఏమిటి?

- ఫార్ములాఈ కారు రేసులో ప్రమోటర్ గా ఉండనున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది?

- మిమ్మల్ని ఈ కారు రేసుకు ప్రమోటర్ గా ఆహ్వానించింది కేటీఆరేనా?

- ప్రమోటర్ గా అవకాశం లభిస్తుందన్న విషయం తెలిసే.. రేసు ప్రారంభానికి ముందు ఈ కంపెనీల్ని తెరిచారా?

- అప్పట్లో మీకు .. రాష్ట్ర పురపాలక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ తో మీకు జరిగిన సంభాషణలేంటి?

- కంపెనీకి రావాల్సిన రూ.90 కోట్ల ఫీజును ఏస్ అర్బన్ డెవలపర్స్ నుంచి రుణంలో ఎందుకు తీసుకున్నారు?

- ఏస్ అర్బన్ డెవలపర్స్ కంపెనీ ఏస్ నెక్ట్స్ జెన్.. ఏస్ రేస్ కంపెనీల అనుబంధ సంస్థనే కదా?

నిజానికి విచారణ ఆలస్యంగా ప్రారంభమైది. దీనికి కారణం విచారణకు హాజరైన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ కంపెనీ ప్రతినిధులు రావాల్సిన విమానం ఆలస్యం కావటంతో.. కాస్త ఆలస్యంగా వచ్చారు. తమ విమానంలేట్ అవుతుందని.. తమకు కాస్త సమయం ఇవ్వాలని కోరగా.. అందుకు అధికారులు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మూడున్నర గంటల పాటు సాగిన విచారణ పూర్తి కాలేదని.. సమయం సరిపోలేదు కాబట్టి.. మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ చుట్టూనే అధిక ప్రశ్నలు ఎదురైనట్లుగా తెలుస్తోంది.