Begin typing your search above and press return to search.

ఇండియా కూటమికి బీటలు.. స్వరం మార్చిన మిత్రపక్షాలు

ఇక.. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఖంగుతింది.

By:  Tupaki Desk   |   10 Oct 2024 6:36 AM GMT
ఇండియా కూటమికి బీటలు.. స్వరం మార్చిన మిత్రపక్షాలు
X

హర్యానా సర్వేలన్నీ కాంగ్రెస్‌కే గెలుపు అవకాశాలు అని రిపోర్టులు ఇవ్వడంతో ఆ పార్టీ ఎక్కడలేని ఆశలు పెట్టుకుంది. ఫలితాల రోజు కూడా మొదట్లో ట్రెండింగ్ కాంగ్రెస్‌కు అనుకూలంగానే కొనసాగాయి. దాంతో కాంగ్రెస్ శ్రేణులంతా సంబరాల్లో మునిగాపోయారు. రౌండ్‌లు పెరుగుతున్న కొలదీ ఫలితాలు రివర్స్ అయ్యాయి. కంప్లీటుగా బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఇక.. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. ఫైనల్లీ హర్యానాలో అధికారం చేపట్టలేకపోయింది. బీజేపీనే హ్యాట్రిక్ విజయం సాధించింది.

ముందు నుంచి హర్యానాలో తామే గెలుస్తున్నామని నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ ఫలితాలు చేదు మిగిల్చడంతో ఆ పార్టీ నేతలు ఏవేవో ఆరోపణలు కూడా చేశారు. ఫలితాలను సరిగా లెక్కించలేదని, ఈవీఎంలలో లోపాలు ఉన్నాయంటూ ఆరోపించారు. కానీ.. వాటిని ఎన్నికల సంఘం ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని తేల్చిచెప్పింది. ఇప్పటికే హర్యానా ఫలితాలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మరో భారీ షాక్ తగిలింది. ఈ సారి మిత్రపక్షాల నుంచి ఆ సెగను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఒక్కో ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీపై విమర్శలు చేయడం ప్రారంభించాయి. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ అవకాశవాద ధోరణితో వ్యవహరిస్తున్నదని ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. హర్యానాలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నా మిత్రపక్షమైన ఆప్‌ను కాంగ్రెస్ దూరం పెట్టిందని, అదే జమ్ముకశ్మీర్‌లో బలం లేదని ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌తో చేతులు కలిపిందని విమర్శలున్నాయి. హర్యానాలో ఆప్‌తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బరిలోకి దిగి ఉంటే ఫలితాలు మరొలా ఉండేవని చెబుతున్నారు. అవకాశవాదంతోనే ఒంటరిగా బరిలోకి దిగి బొక్కాబోర్లా పడిందని మండిపడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఆప్ కూడా కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం కానున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ఇప్పటికే ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు.. యూపీ బైపోల్స్ కోసం సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీ ముందస్తుగానే అనౌన్స్ చేసింది. అయితే ఈ ప్రకటన వెనుక కాంగ్రెస్ పార్టీపై సమాజ్‌వాదీ పార్టీకి ఉన్న ఆగ్రహమేనని అర్థం అవుతోంది.

హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కోసం చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ కాస్త పట్టుదలగా వ్యవహరించింది. దాంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. హర్యానాలో పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత, సాగు చట్టాలపై రైతుల ఆందోళన, రెజ్జర్ల ధర్నాలు, అగ్నివీర్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో అవి బీజేపీని ఓడిస్తాయని కాంగ్రెస్ గట్టి నమ్మింది. దాంతో ఆప్‌తో సీట్ల సర్దుబాటుకు వెనుకడుగు వేసిందని ఆ పార్టీ నేతలు చెప్పారు.

ఇక మహారాష్ట్రలో ఈ ఏడాది చివరలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్రంలోని శివసేన (యూబీటీ) కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. కానీ.. మొదటి సారి ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గ కుమ్ములాటల వల్లనే ఎన్నికల్లో ఓడిపోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అలాగే జరిగిందని, ఇప్పుడు హర్యానాలోనూ కుమ్ములాటల వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని ఆరోపించింది. ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారం వల్లే కాంగ్రెస్ ఓడిపోయినట్లు శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది.

అటు.. తృణమూల్ కూడా కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయింది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను తన అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నదని, ఈ విషయాన్ని ప్రాంతీయ పార్టీలు గుర్తించాలని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ట్వీట్ చేయడం సంచలనానికి దారితీసింది. తాము గెలుస్తామని అనిపిస్తే మరో పార్టీకి అవకాశం ఇవ్వం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని పేర్కొన్నారు. ఆ చిన్నచూపే కాంగ్రెస్ పార్టీని ఓడించిందని చెప్పుకొచ్చారు.