రాజాసింగ్ ను తొక్కేస్తున్న బీజేపీ ముఖ్యుడు అతనేనా?
అలాంటి అంతర్గత రాద్ధాంతం కారాణంగానే... ఇప్పుడు బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, హిందుత్వవాదులందరూ తలుచుకునే నాయకుడు అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ వార్తల్లో నిలుస్తున్నారు.
By: Tupaki Desk | 16 Nov 2024 9:30 PM GMTరాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది ఎంత నిజమో... సిద్ధాంతపరంగా ఒకటే అయినా అంతర్గత రాద్దాంతం జరగకుండా ఉంటుంది అనుకోవడం కూడా అంతే అబద్దం. అలాంటి అంతర్గత రాద్ధాంతం కారాణంగానే... ఇప్పుడు బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, హిందుత్వవాదులందరూ తలుచుకునే నాయకుడు అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ వార్తల్లో నిలుస్తున్నారు.
ఎంఐఎం ఇలాకా అయిన పాతబస్తీలోనే కాకుండా బీజేపీ తరఫున హైదరాబాద్‌లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్... ఇప్పుడు సొంత పార్టీలోనే అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కుంటున్నారని ఆయన ఫాలోవర్స్ సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. ఇందుకు కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై హైదరాబాద్ వేదికా బీజేపీ సాగిస్తున్న పోరు బాట. అందులో రాజాసింగ్ కు దక్కుతున్న ప్రాధాన్యత గురించి!
`మూసి ప్రక్షాళన చేయండి.. పేదల ఇల్లు కూలకొట్టకండి` అంటూ నినదిస్తున్న బీజేపీ తెలంగాణ విభాగం పేదలతో తాము క్షేత్రస్థాయిలోనే ఉంటామని... ప్రజలకు భరోసా ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగానే, బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమాన్ని తలపెట్టింది. బోడుప్పల్ నుంచి పాతబస్తీ వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో 20 చోట్లను ఎంపిక చేసిన బీజేపీ ఆ ప్రాంతాల్లో నేడు (శనివారం రాత్రి) బీజేపీ నేతలు అక్కడికి వెళ్లి స్థానికులతో రచ్చబండ నిర్వహించనున్నారు. బాధితుల ఇండ్లలోనే భోజనం చేసి అక్కడే నిద్రించనున్నారు.
బీజేపీ బస్తీ నిద్ర ప్రోగ్రాం కార్యాచరణ బాగున్నప్పటికీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. బస్తీ నిద్రలో భాగంగా 20 ప్రాంతాల్లో పాల్గొనే ముఖ్య నేతల పేర్లనూ ప్రకటించిన బీజేపీ పెద్దలు అందులో రాజాసింగ్ పేరును కట్ చేసేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, హైదరాబాద్‌లో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌కు మాత్రం చోటు దక్కకపోవడం... పైగా ఇతర జిల్లాలకు చెందిన నేతలకు చోటిచ్చి ఆయనకు ఇవ్వకపోవడంతో... రాజాసింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైరవుతున్నారు. బీజేపీలో కీలక నేత, ఢిల్లీ స్థాయికి చేరిన ఓ నాయకుడికి రాజాసింగ్ అంటే నచ్చకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, వరుసగా మూడు సార్లు గెలిచిన రాజాసింగ్‌ను కాదని బీజేపీ శాసనసభాపక్ష నేతగా పార్టీలో ఇటీవల చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్‌రెడ్డిని పార్టీ ప్రకటించడం వెనుక కూడా కారణాలు ఏంటో సులభంగా అర్థం చేసుకోవచ్చునని చెప్తున్నారు. బీజేపీ నిర్ణయాలు, రాజాసింగ్ కేంద్రంగా జరుగుతున్న వివాదాలు.. ఏ విధంగా మలుపుతిరుగుతాయో చూడాలి మరి!