గ్రీష్మంలో చైత్రం : మాజీ స్పీకర్ కూతురుకు బెస్ట్ చాన్స్ !
ఆమె 2014 తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి దూరం అయ్యారు.
By: Tupaki Desk | 19 Nov 2024 3:34 AM GMTఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉంటూ మంత్రి పదవితో పాటు ఉమ్మడి ఏపీలో తొలి మహిళా స్పీకర్ గా పనిచేసిన కావలి ప్రతిభాభారతి రాజకీయంగా ఇపుడు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఆమె 2014 తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి దూరం అయ్యారు.
ఆమె తన కుమార్తె కావలి గ్రీష్మను రాజకీయ వారసురాలిగా ముందుకు తెచ్చారు. 2019లోనూ 2024 ఎన్నికల్లోనూ రాజాం నుంచి కుమార్తెకి టికెట్ కోసం ఆమె ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావు వైపు టీడీపీ అధినాయకత్వం మొగ్గు చూపడంతో కావలి గ్రీష్మకు అవకాశం దక్కలేదు
రాజకీయంగా ఆమెకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని అధినాయకత్వం భరోసాను ఇస్తూ ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అందించింది. కీలకమైన ఈ పదవిలో గ్రీష్మకు చాన్స్ ఇవ్వడం ద్వారా ఆమెలో కొత్త ఆశలను రేకెత్తించారు అని అంటున్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న టఫ్ టైం లో ఆమె మీడియా ముందుకు వచ్చి వైసీపీ ప్రభుత్వ మీద విమర్శలు చేయడమే కాకుండా డిబేట్లలో సైతం గట్టిగా మాట్లాడి పార్టీకి బలమైన వాయిస్ గా నిలిచారు అని ఆమె వర్గం గుర్తు చేస్తున్నారు. అయితే ఆమెకు ఎమ్మెల్యేగా చాన్స్ ఇవ్వకపోయినా గుర్తించతగిన నామినేటెడ్ పదవి అయితే దక్కిందని ఆమె వర్గం హర్షిస్తోంది.
ఇక 2029 ఎన్నికల్లో కచ్చితంగా ఆమెకు టికెట్ దక్కుతుందని అంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో మరిన్ని కొత్త సీట్లు వస్తాయని తద్వారా గ్రీష్మ లాంటి వారికి అక్కడ అకాడిమేట్ చేసే వీలు ఉంటుందని అంటున్నారు. ఇక గ్రీష్మ రాజాం టికెట్ ని ఆశిస్తున్నారు.
ఒక వేళ అసెంబ్లీ సీట్లు పెరగకపోయినా రెండు సార్లు కోండ్రుకు చాన్స్ ఇచ్చారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో గ్రీష్మ పేరుని కచ్చితంగా పరిశీలిస్తారు అని అంటున్నారు. అతి చిన్న వయసులో కావలి ప్రతిభా భారతి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఆమె వారసురాలిగా తల్లి బాటలో నడుస్తున్న గ్రీష్మకు కూడా ఆ చాన్స్ టీడీపీ ఇస్తుందని ఆమె వర్గం బలంగా నమ్ముతోంది.
మొత్తానికి గ్రీష్మకు పార్టీలో ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఉంది అనడానికి ఈ పదవిని ఇవ్వడమే నిదర్శనమని అంటున్నారు. ఇక నారా లోకేష్ యూత్ టీం లో గ్రీష్మ వంటి వారు కూడా ఉన్నారని అంటున్నారు. సో ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని గ్రీష్మ వర్గీయులు ఉప్పొంగుతున్నారు. సో నెక్స్ట్ టైం బెటర్ లక్ చెల్లెమ్మకు అని రాజాం టీడీపీ అంటోందిట.