బీజేపీ అనుమానపు చూపులు : నితీష్ తో తేడా కొడుతోందా ?
ఇపుడు మళ్లీ నితీష్ కుమార్ చూపు ఇండియా కూటమి మీద ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 6 Sep 2024 9:30 PM GMTబీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ అంటేనే దేశ రాజకీయాల్లో ఒక స్పెషాలిటీ. అదేంటి అంటే ఆయన దూకినన్ని గోడ దూకుళ్ళు మరో సీనియర్ నేత కానీ ఒక పార్టీ అధినేత కానీ దూకి ఉండరు. అంతదాకా ఎందుకు 2020లో బీజేపీతో పొత్తులో ఉండి బీహార్ లో గెలిచిన నీతీష్ ఈ అయిదేళ్ల టెర్మ్ లో ఇండియా కూటమి వైపు ఒక సారి మళ్లీ ఎన్డీయే వైపు మరోసారి ఇలా దూకుతూనే ఉన్నారు.
ఇపుడు మళ్లీ నితీష్ కుమార్ చూపు ఇండియా కూటమి మీద ఉందని అంటున్నారు. నిజానికి నితీష్ కొంత కాలం క్రితమే ఇండియా కూటమి నుంచి ఎన్డీయే వైపు వచ్చారు. ఆయన ఈ సందర్భంగా అన్న మాటలను చూస్తే ఇంక జీవితాంతం ఎండీయేతోనే అని. అంతే కాదు ఏకంగా బహిరంగ వేదికల మీద మోడీ కాళ్ళకు దండం పెట్టి చాలానే చేశారు.
ఇలా ఒట్లు పెట్టిన ప్రతీసారి దానిని గట్టు మీద పెట్టడం నితీష్ కి అలవాటే అని కూడా అంటున్నారు. ఆయనలో ఈ రాజకీయ పిల్లి మొగ్గలు కనుక లేకపోయి ఉంటే ఈ దేశానికి ప్రధాని పదవి రేసులో ఉండేవారు అని కూడా చెప్పుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంతో అనుకున్నంత సంఖ్యతను ప్రదర్శించడం లేదు అని అంటున్నారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశానికి నితీష్ డుమ్మా కొట్టిన సంగతిని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ప్రధాని మోడీతో కలసి పాల్గొనే ఈ మీటింగ్ కి నితీష్ రాకుండా వ్యవహరించారు అంటేనే ఆయనలో అలకలు అసంతృప్తులు మొదలయ్యాయి అని ఒక సంకేతం అయితే వచ్చింది.
ఇక కేంద్రంలో ఎన్డీయేకి ప్రాణ సమానమైన మద్దతుని నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ఇస్తోంది. ఆ పార్టీకి 15 మంది ఎంపీల బలం ఉంది. ఇది మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి ఎంతో కీలకంగా ఉంది. అయితే నితీష్ కుమార్ కేంద్రంలో బీజేపీ మూడవసారి తమ పార్టీ మద్దతుతో ఏర్పాటు కావడంతోనే అటక మీద ఉంచిన ప్రత్యేక హోదా నినాదాన్ని బయటకు తీశారు.
బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. అయితే కేంద్రం మాత్రం హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. బీహార్ కి ఆ అర్హత లేదని చెప్పేసింది. దానికి బదులుగా కేంద్ర బడ్జెట్ లో భారీగా నిధులు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఆ తరువాత నుంచే నితీష్ లో కొంత మార్పు వచ్చింది అని అంటున్నారు.
లేటెస్ట్ గా చూస్తే ఆయన బీహార్ లో ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీతో కలసి ముచ్చట్లు పెట్టడం దేశ వ్యాప్తంగా చర్చకు తావు ఇస్తోంది. గత నితీష్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లాలూ కుమారుడు, అసెంబ్లీలో ఆర్జేడీ విపక్ష నేత అయిన తేజశ్వి యాదవ్ తో నితీష్ భేటీ కావడంతో కొత్త సందేహాలు పుట్టుకుని వస్తున్నాయి.
తేజస్వి యాదవ్ వైఖరి కారణంగానే తాను దూరంగా ఆ పార్టీకి కూటమికి జరిగినట్లుగా గతంలో చెప్పిన నితీష్ ఇపుడు ఈ యువ నేతతో భేటీ కావడమేంటి అన్న చర్చ సాగుతోంది. ఇది జాతీయ స్థాయిలో అగ్గి రాజుకునేలా చేస్తోంది. నితీష్ మెల్లాగా ఇండియా కూటమి వైపు జరుగుతున్నారా అన్న అనుమానాలు బలపడేలా ఈ భేటీ ఉందని అంటున్నారు.
అతి తక్కువ సీట్ల ఆధిక్యతతో ఎన్డీయే మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నితీష్ కుమార్ జేడీయూ మద్దతు ఉప సం హరించుకుంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగినట్లే అని అంటున్నారు.
దాంతో బీజేపీ కూడా ఈ భేటీని అనుమానపు చూపులతోనే చూస్తోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్ లో రెండు రోజుల పర్యటన చేపట్టడంతో రాజకీయాలు మరింతగా హీటెక్కిపోతున్నాయి.
జేపీ నడ్డాకీ ఈ భేటీ వెనక ఉన్న అజెండా మీద ఏమైనా సమాచారం ఉందా అన్నది కూడా చర్చకు వస్తోంది. అదే విధంగా బీజేపీ కూడా ఈ భేటీ దాని వెనక రాజకీయం భవిష్యత్తు పరిణామాలను సేకరించే పనిలో ఉందని అంటున్నారు.
మరో వైపు చూస్తే నితీష్ తేజస్వి యాదవ్ ల భేటీ కేవలం సమాచార కమిషర్ నియామకం మీద చర్చించేందుకే అని అధికార వర్గాలు చెబుతున్నా ఇపుడున్న రాజకీయ వేడిలో నితీష్ వైఖరి తెలిసినవారికి అది ఏమంత నమ్మకంగా లేదని అంటున్నారు. మొత్తం మీద ఏదో జరగబోతోంది అన్నది అర్ధం అవుతోంది అని అంటునారు. జాతీయ రాజకీయాలో భూకంపం వంటిది ఏమైనా వస్తే కనుక కచ్చితంగా అది బీహార్ నుంచే వస్తుందని భూకంపం కేంద్ర స్థానం బీహారేనని అంతా అంటున్నారు. సో చూడాల్సిందే.