Begin typing your search above and press return to search.

సీఎం చంద్రబాబు అన్నది పవన్ మర్చిపోతున్నారా?

ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంది.

By:  Tupaki Desk   |   13 Jan 2025 5:30 AM GMT
సీఎం చంద్రబాబు అన్నది పవన్ మర్చిపోతున్నారా?
X

ఒక ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా? ఒకవేళ అలా ఇమిడే పరిస్థితే ఉంటే.. రెండు కత్తుల్ని ఒకేసారి బయటకు తీయటం సాధ్యమవుతుందా? మొదటిది ఎలా సాధ్యం కాదో.. రెండోది కూడా అదే పరిస్థితి. అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలోని ప్రభుత్వం బలంగా ఉండాలన్నా.. అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాలన్నా పాలకుడు బలంగా ఉండాలి. ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంది.

ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టటం తెలిసిందే. ఎంత ఉప ముఖ్యమంత్రి అయితే మాత్రం.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన తీరు అందుకు భిన్నంగా ఉంటోంది. కీలక సమయాల్లో పాలకుడిగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకొని.. అమలు చేయాల్సి ఉంటుంది. కానీ.. ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించటం లేదు.

ప్రభుత్వం కొలువు తీరిన ఆర్నెల్ల కాలంలోనే కాదు.. మొన్నీ మధ్యనే చోటు చేసుకున్న తిరుపతి తొక్కిసలాట ఉదంతాన్ని చూస్తే.. సీఎం.. డిప్యూటీ సీఎంల వేర్వేరుగా ప్రకటనలు ఇవ్వటం.. వేర్వేరుగా పరామర్శలు చేయటం కనిపిస్తోంది. అనూహ్య విషాదం చోటు చేసుకున్నప్పుడు.. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఎంతమంది పరామర్శలు చేసినా తప్పేమీ లేదు. కాకుంటే.. కీలక ప్రకటనలు మాత్రం ముఖ్యమంత్రి మాత్రమే చేయటం బాగుంటుంది.

కానీ.. తిరుపతి ఎపిసోడ్ చూస్తే.. అలాంటిది కనిపించదు. టీటీడీ ఛైర్మన్.. టీటీడీ ఈవోలు తొక్కిసలాటకు క్షమాపణలు చెప్పాలని చెప్పటమే కాదు.. తొక్కిసలాట విషయంలో పోలీసుల ఫెయిల్యూర్ పైనా పవన్ చెలరేగిపోవటం కనిపిస్తుంది. కారు నుంచి బయటకు వచ్చి.. అందరి ముందు పెద్ద పెద్ద అరుపులు.. కేకలు వేయటం.. వైఫల్యాలపై వీరావేశాన్ని ప్రదర్శించటం కనిపిస్తుంది. అధికారపక్షంగా ఉండి.. తప్పులు చేస్తున్న అధికారుల విషయంలోనూ.. నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవటానికి నూటికి నూరు శాతం అవకాశం ఉన్నప్పుడు.. అరుపులతో పనేముంది?

నిజానికి.. కూటమిలో కీలకపార్టీలైన తెలుగుదేశం.. జనసేనల అధినేతలు ఇద్దరు కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం బాగుంటుంది. ఒకవేళ.. అలా కుదరదనుకుంటే.. సీఎంగా తానేం చేయాలి? డిప్యూటీ సీఎంగా తన పరిమితి ఎంతన్న విషయాన్ని పవన్ గుర్తిస్తే మంచిందంటున్నారు. నిజానికి పవన్ ను కంట్రోల్ చేసే వారే లేరు. ఆయన్ను ఆయన మాత్రమే కంట్రోల్ చేసుకోగలరు.

తాను కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ చూపిన తెగువను చంద్రబాబు మర్చిపోలేరు. దీంతో.. ఆయన కొన్నిసార్లు అవసరానికి మించి స్పందిస్తున్నా.. ఏమీ అనలేని పరిస్థితి. కానీ.. ఈ తీరు ఎబ్బెట్టుగా ఉంటుందన్న విషయాన్ని పవన్ గుర్తిస్తే మంచిది. నిజానికి ఏదైనా అంశంలో ప్రక్షాళన చేయాలి.. ఫలానా చర్యలు తీసుకోవాలని పవన్ డిసైడ్ అయి.. చంద్రబాబుకు చెబితే ఆయన అందుకు అంగీకరించకుండా ఉండే పరిస్థితి లేదు. అలాంటప్పుడు అవసరానికి మించి ఆవేశాన్ని ప్రదర్శించాల్సిన అవసరం పవన్ కు ఎందుకు? అన్నది ప్రశ్న