Begin typing your search above and press return to search.

మళ్లీ తప్పిన సర్వే అంచనాలు.. జార్ఖండ్‌లో ఆ కూటమిదే అధికారం!

ఇప్పటికే ట్రెండ్ స్పష్టం అవుతుండగా.. మరికొద్ది గంటల్లో ఏ పార్టీ ఎన్ని సాధించిందో స్పష్టమైన ఫిగర్ రానుంది.

By:  Tupaki Desk   |   23 Nov 2024 6:33 AM GMT
మళ్లీ తప్పిన సర్వే అంచనాలు.. జార్ఖండ్‌లో ఆ కూటమిదే అధికారం!
X

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. ఈ రోజు ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ట్రెండ్ స్పష్టం అవుతుండగా.. మరికొద్ది గంటల్లో ఏ పార్టీ ఎన్ని సాధించిందో స్పష్టమైన ఫిగర్ రానుంది. కాగా.. ఇప్పటికే ఏ రాష్ట్రం ఏ కూటమి కైవసం చేసుకోబోతున్నదో తేటతెల్లమైంది.

రెండు నెలల క్రితమే జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాల్లో ఊహించని విధంగా ఫలితాలు వెల్లడయ్యాయి. ఒకవిధంగా చెప్పాలంటే అక్కడి సర్వే అంచనాలు సైతం తప్పాయి. ఏ సర్వే చూసినా ఇరు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారం చేపడుతుందని వెల్లడించాయి. ఏ ఒక్క సర్వేలో కూడా ఎన్డీయేకు అనుకూలంగా ఇవ్వలేదు. కానీ.. అనూహ్యంగా హర్యానా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఎన్డీయే కూటమినే అధికారం చేపట్టింది.

తాజాగా.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగిశాయి. చివరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే పలు సర్వేలు తమ అంచానాలను రిలీజ్ చేశాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ అధికారం కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు సాధించాలి. ఇక్కడ ఎన్డీయే కూటమి గెలుపు సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వేలు వెల్లడించాయి. 200 సీట్లకు పైగా ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫలితాల ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే అదే నిజం అయ్యేలా కనిపిస్తోంది. మహారాష్ట్రలో మరోసారి కాషాయం జెండా ఎగరబోతోంది. ఇక్కడ మహాయుతి స్పష్టమైన ఆధిక్యతతో ఉంది. 221 ప్లస్ సీట్లలో ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. దాదాపు ఇక్కడ మహాయుతి గెలుపు ఖరారైనట్లే అని చెప్పుకోవచ్చు.

ఇక.. జార్ఖండ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న 81 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 41 సీట్లు గెలుచుకోవాలి. కానీ.. ఎన్డీయేకు 42 నుంచి 47 సీట్ల వరకు వస్తాయని సర్వేలు అంచనా వేశాయి. అదే కాంగ్రెస్ కూటమి 25 నుంచి 30 స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడించాయి. కానీ.. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్ కూటమి 49 ప్లస్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే.. బీజేపీ కూటమి 30 స్థానాల వరకే ఆగిపోయింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ కూటమికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సర్వేల సంస్థలపై మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మళ్లీ సర్వేలా అంచనాలు తప్పాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.