పండక్కి వచ్చిన కొత్తల్లుడిలా జైల్లో పరిస్థితి!... వెంకటరెడ్డి విషయంలో బాబు హుకుం!
వాస్తవానికి కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన వెంకటరెడ్డికి డిప్యూటేషన్ పూర్తి కావాల్సి ఉంది.
By: Tupaki Desk | 30 Nov 2024 6:22 PM GMTఏపీఎండీసి మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇసుక అనుమతులు ఇవ్వడంలో ఆయన చాలా అవకతవకలపు పాల్పడ్డారనే ఆరోపణలు బలంగా రావడంతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆయనపై ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తోంది. వాస్తవానికి కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన వెంకటరెడ్డికి డిప్యూటేషన్ పూర్తి కావాల్సి ఉంది. అయితే.. సస్పెండ్ చేయకపోతే రిలీవ్ అయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. న్యాయ సలహా తీసుకుని సస్పెండ్ చేసిందని అంటారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.
అయితే... అక్కడ రాజభోగం అనుభవిస్తున్నారని కథనాలొచ్చాయి! ఇందులో భాగంగా.. జైల్లో టీవీ, ఫ్రిడ్జ్, నచ్చిన భోజనం బయట నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి పెడుతున్నారని అంటున్నారు. ఇలా వెంకటరెడ్డిని జైలు అధికారులు పండక్కి అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడిని చూసుకుంటున్నట్లు చూసుకుంటున్నారని కథనాలొస్తున్నాయి.
అవును... జైల్లో ఉన్న ఏపీఎండీసి మాజీ ఎండీ వెంకటరెడ్డి వ్యవహారం పండక్కి వచ్చిన కొత్త అల్లుడిలా ఉందని.. జైల్లో సకల రాజభోగాలు అనుభవిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దీంతో.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. దీనిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.
ఇందులో భాగంగా... జైల్లో కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, బయట భోజనం ఏర్పాటు విషయంలో వెంకటరెడ్డికి ఎవరు సహకరించారో పూర్తి వివరాలు ఇవ్వాలని చంద్రబాబు హుకుం జారీ చేశారని అంటున్నారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారో తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారని తెలుస్తోంది.