యనమలకు అర్థమైందా ?
కానీ ఆయన ఏకంగా కొందరి పేరు చివరన కులాలను సూచించే తోకలను తగిలించి మరీ రాసిన ఈ లేఖలో మసాలా ఘాటు ఎక్కువగా ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 10 Dec 2024 3:36 AM GMTటీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు కాకినాడ సెజ్ పేరుతో బిగ్ షాట్స్ బీసీల పొట్ట కొట్టారు అంటూ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంధించిన లేఖాస్త్రం ఒక బలమైన సామాజిక వర్గానికి గట్టిగా గుచ్చుకుంది. ఆయన ఆ లేఖలో బీసీల గురించి వారి సమస్యల గురించి ప్రస్తావించ వచ్చును. కానీ ఆయన ఏకంగా కొందరి పేరు చివరన కులాలను సూచించే తోకలను తగిలించి మరీ రాసిన ఈ లేఖలో మసాలా ఘాటు ఎక్కువగా ఉందని అంటున్నారు.
యనమల అంటే చాలా లౌక్యం తెలిసిన నాయకుడు. చంద్రబాబు సీఎం ఎపుడు అయినా ఆర్థిక మంత్రిగా పక్కన ఆయనే ఉంటారు. టీడీపీలో అలా అత్యధిక కాలం ఆర్ధిక మంత్రిగా చేసిన రికార్డు ఆయన సొంతం. అసెంబ్లీని ఆయన టీడీపీ అధికారంలో ఉన్నపుడు స్పీకర్ గానూ శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రిగానూ నడిపించిన తీరు కూడా అంతా చర్చించుకుంటూనే ఉంటారు.
చంద్రబాబు వద్ద పలుకుబడి సాన్నిహిత్యం ఎక్కువగా ఉన్న నేత యనమల అనడంలో సందేహం లేదు. అలాంటి పెద్దాయన ఇలా ఒక లేఖ సంధించి ఒక సామాజిక వర్గం కన్నెర్రకు గురి అవడం అంటే ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు. యనమల రాజ్యసభ సీటు మీద కోటి ఆశలు పెట్టుకున్నారు.
ఆయన దాని కోసం 2016 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆనాడు యనమల వెళ్తే ఆర్థిక మంత్రిగా ఆయన పాత్ర కీలకం కాబట్టి బాబు వద్దు అని అన్నారని టాక్ నడచింది. ఇక 2019 నుంచి 2024 మధ్యలో చూస్తే టీడీపీకి రాజ్యసభ సీటుని ఒక్కటి కూడా గెలిపించుకునే సంఖ్యా బలం లేకుండా పోయింది. ఇపుడు బంపర్ విక్టరీ దక్కింది.
మొత్తానికి మొత్తం సీట్లు టీడీపీకే దక్కుతాయని తెలుసు. ఈ నేపధ్యంలో అనుకోని వరంలా మూడు ఎంపీ సీట్లు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి తనకు గ్యారంటీ అని యనమల గట్టిగానే భావించారు అని అంటారు. ఎందుకంటే యనమల ఎమ్మెల్సీ పదవీ కాలం 2025 మార్చి 30తో ముగిసిపోతుంది. ఆ తరువాత ఆయన చట్ట సభలకు దూరం అవుతారు. మాజీగానే మిగులుతారు.
అందుకే అయన ఈ పదవి ఉండగానే ఢిల్లీలో పెద్దల సభకు వెళ్ళాలని అనుకున్నారు అంటున్నారు. ఇక ఆయన వయసు ఇపుడు 74 ఏళ్ళు దాటాయి. అందువల్ల ఇపుడే రాజ్యసభ ఇస్తే చేయడానికి స్కోప్ ఉంటుందని అనుకున్నారు. 2026లో చాన్స్ ఉన్నా పోటీ ఎక్కువగా ఉండొచ్చు అని ఆనాటికి తాను మరింతగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యే ప్రమాదం ఉందని భావించారో ఏమో కానీ ఆయన ఇపుడే ఎంపీ కావాలని అనుకున్నారు.
కానీ బాబు మాత్రం ఆయన పేరుని పరిగణనలోకి తీసుకోలేదు. ఆ మాటకు వస్తే ఆయన కుమార్తెకు మంత్రి పదవి దక్కలేదు అన్న బాధ కూడా ఉందని అంటారు. ఇక గవర్నర్ పోస్టు విషయం తీసుకుంటే అది విజయనగరం పూసపాటి రాజు అయిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇస్తారు అని అంటున్నారు.
ఈ మొత్తం పరిణామాలు అన్నీ చూసిన మీదటనే యనమల బీసీల వాయిస్ ని గట్టిగా వినిపించాలని అనుకున్నారని అంటున్నారు. అయితే ఆయన వ్యూహం కరెక్టే అయినా అందులో వేరే కులం వారిని పాయింట్ అవుట్ చేసినట్లుగా తోకలు తగిలించడంతో అసలు వ్యూహం బెడిసి కొట్టి కొత్త ఇబ్బంది స్టార్ట్ అయింది అని అంటున్నారు.
ఏది ఏమైనా యనమలకు అంతా అర్థం అయిందని అందుకే ఇలా లేఖ రూపంలో బయటపడ్డారని అంటున్నారు. సో యనమల ఇక మాజీ మంత్రిగానే ఉంటారా లేక ఈ మధ్యలో కానీ 2026లో కానీ ఏమైనా చాన్స్ తగులుతుందా అంటే ఏమో ఆలోచించాల్సిందే అని వినిపిస్తున్న మాట.