నర్సాపురం ఎంపీ సీటు...బీజేపీ క్లారిటీ ఇచ్చేసిందా...!?
ఈసారి కూడా తాను నర్సాపురం నుంచి గెలిచి వైసీపీకి సత్తా చూపాలని అనుకున్నారు.
By: Tupaki Desk | 8 April 2024 3:00 AM GMTఏపీలో నర్సాపురం ఎంపీ సీటు కూడా హాట్ ఫేవరేట్ గా మారింది. ఎందుకు అంటే అక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు పోటీ చేసి గెలిచారు. ఆయన నాలుగున్నరేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం మీద రాజకీయ సమరమే చేశారు. ఈసారి కూడా తాను నర్సాపురం నుంచి గెలిచి వైసీపీకి సత్తా చూపాలని అనుకున్నారు.
పార్టీలు ఏవైనా తానే ఎంపీ క్యాండిడేట్ అని ఆయన గత రెండేళ్ళుగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆయన ఆశలు నెరవేరలేదు. టీడీపీ నుంచి బీజేపీకి పొత్తులో భాగంగా ఈ సీటు వెళ్లిపోయింది. పోనీ బీజేపీ అయితేనేమి తనకు ఆ సీటు ఖాయమని రఘురామ ఆశించిన ఆయనను కాదని కొత్త ముఖానికి అక్కడ బీజేపీ చోటు ఇచ్చింది.
అయితే ఇంకా నామినేషన్లకు టైం ఉంది కాబట్టి ఏమైనా ఈ మధ్యలో జరగవచ్చు అన్నది రఘురామ ఆశగా ఉంది. అందుకే ఆయన ఎంపీగా అయినా ఎమ్మెల్యే అయినా పోటీ చేయడం తధ్యమని ఊరిస్తూ ఉన్నారు. అయితే రాఘురామ ఆశలకు మరోసారి చెక్ పెట్టేసింది బీజేపీ నాయకత్వం.
ఆ పార్టీ ఏపీ ఇంచార్జి అయితే నర్సాపురం సీటు మాదే అని తేల్చి చెప్పేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో సిద్దార్థ నాధ్ సింగ్ మాట్లాడుతూ నర్సాపురం ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా వర్మ పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేదని ఆయన పేర్కొనడం విశేషం. వర్మ 34 సంవత్సరాలుగా బీజేపీ లో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నారని అన్నారు.
దీంతో చూస్తే కనుక నర్సాపురం సీటు నుంచి రఘురామకు నో చాన్స్ అని తేలిపోయింది. అలాగే బీజేపీ లో దశాబ్దాలుగా పనిచేస్తున్న శ్రీనివాసవర్మకు టికెట్ ఇవ్వాలని బీజేపీ గట్టిగానే డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సీటు విషయంలో టీడీపీ బీజేపీల మధ్యలో చర్చకు సాగుతున్నాయని విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చి నర్సాపురం సీటుని తిరిగి టీడీపీ తీసుకుంటుందని ప్రచారం అయితే సాగుతోంది.
అలా ఆ సీటులో రఘురామను నిలబెట్టాలని కూడా చూస్తోంది. ఆయనను టీడీపీలో చేర్చుకున్నారు. కచ్చితంగా ఆయనకు పోటీ చేస్తే సీటుని చూపించాల్సి ఉంది రఘురామ ఎంపీ సీటే కోరుకుంటున్నారు. పైగా ఆయన నర్సాపురం మీద మక్కువ కనబరుస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయన తాను జూన్ 4 వరకూ నర్సాపురం సిట్టింగ్ ఎంపీని అని కూడా చెప్పుకున్నారు. మరి బీజేపీ కీలక నేత ఇలా ప్రకటించేశారు. ఇపుడు రఘురామ కిం కర్తవ్యం అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.