Begin typing your search above and press return to search.

చంద్రబాబు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారా ?

అయితేనేమి పదహారు సీట్లు దక్కించుకున్న టీడీపీ యే ఎన్డీయే సర్కార్ కి ఆక్సిజన్.

By:  Tupaki Desk   |   8 Jun 2024 1:30 AM GMT
చంద్రబాబు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారా ?
X

టీడీపీ అధినేత చంద్రబాబుకు నిజంగా గోల్డెన్ చాన్స్ వచ్చింది అని చెప్పాలి. ఆయన మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం లేదు. బీజేపీ 240 సీట్లు సొంతంగా సంపాదించింది. అయితేనేమి పదహారు సీట్లు దక్కించుకున్న టీడీపీ యే ఎన్డీయే సర్కార్ కి ఆక్సిజన్.

టీడీపీ లేకుండా ఎన్డీయే ప్రభుత్వం లేదు, మోడీ ప్రధాని ఊసూ లేదు. మరి ఇంతటి సువర్ణ అవకాశం వచ్చినపుడు చంద్రబాబు చేయాల్సింది ఏంటి ముందుగానే ఏపీకి ప్రత్యేక హోదా మీద ప్రకటన చేయించడం. ఆ తరువాతనే మోడీ ప్రమాణం. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు చేరడం ఇలా ఉంటాయి.

కానీ చంద్రబాబు మోడీతో ఏమి మాట్లాడారో తెలియదు కానీ అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే వినిపించడం లేదు అని అంటున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని మోడీ సహా ఆ పార్టీ నేతలు అనేక సందర్భాలలో చెప్పి ఉన్నారు. అలాంటి ప్రత్యేక హోదాను తీసుకుని రావడం అంటేనే గ్రేట్ అని చెప్పాలి. అసలు ఈ విషయం లో సాధించాలి అంటే తగిన సమయం ఇదే అని అంటున్నారు. బీజేపీకి అధికారం కావాలి. తెలుగుదేశం పార్టీ ఆక్సిజన్ గా ఉంది.

మరి ఆ ఆక్సిజన్ నే ఆసరాగా చేసుకుని ఏపీకి ప్రత్యేక హోదాతో ఊపిరి పోయవచ్చు కదా అన్నది అందరి మాటగా ఉంది. నిజంగా ఈ టైం లో గట్టిగా మోడీ మీద ఒత్తిడి పెడితే ప్రత్యేక హోదా రావడం చాలా ఈజీ అని అంటున్నారు.

కానీ ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు అవీ చూస్తూంటే ప్రత్యేక హోదా బదులుగా ప్యాకేజిని బాబు కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఏమిటి అంటే అది ఒక బ్రహ్మ పదార్ధం అని అంటున్నారు.

అది ఏ రంగానికి ఎంత ఇస్తారు అన్నది తెలియదు. అసలు ప్రోత్సాహకాలు అన్నవే ఉండవు, ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా వస్తేనే సాధ్యపడుతుంది. సౌత్ లో బెంగళూరు, హైదరాబాద్ చెన్నై లను దాటుకుని ఏపీ వైపు పారిశ్రామిక వేత్తలు చూడాలీ అంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం. కానీ అది కాకుండా ప్యాకేజీ పేరుతో కొంత మొత్తం నిధులు ఇస్తే ఏపీ అభివృద్ధి ఎలా చెందుతుంది అన్నది ప్రశ్న.

సరే ఆ నిధులు ఇచ్చినా అవి కూడా సరిగ్గా సక్రమంగా ఇస్తారా లేక పోలవరం మాదిరిగా మాటలతో సరిపెడతారా అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. ఏపీ ప్రజలు అంతా ఈ తరుణం కోసమే చూస్తున్నారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధించేది ఇపుడే అని అంతా అంటున్నారు. కామ్రేడ్స్ నుంచి ప్రత్యేక హోదా సాధన కమిటీ నిర్వాహకులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు.

బాబు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం అది పెద్ద పొరపాటే అవుతుంది అని అంటున్నారు. ఇక్కడ ఒక మాటను అంతా చెబుతున్నారు. ఎన్ని నిధులు ఇచ్చినా ప్రత్యేక హోదాకు సరిసాటి రాదు అని. అధి ఏపీకి ఉన్న హక్కు అని దానిని సాధించకుండా స్పెషల్ ప్యాకేజి కి బాబు తల వంచితే మాత్రం ఒక చారిత్రాత్మక తప్పిదం అవుతుందని అంతా అంటున్నారు.

మోడీ కానీ బీజేపీ పెద్దలు కానీ ఈ విషయంలో బాబుని ఒప్పిస్తే మాత్రం ఏపీకి అదే శరాఘాతం అవుతుంది అని అంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ప్రత్యేక హోదాను ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దానిని వదిలేసి మరీ ఎన్డీయే కూటమిని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉందని కూడా ఏపీలోని అయిదు కోట్ల ప్రజానీకం ప్రశ్నించవచ్చు. మొత్తంగా బాబుకు మరోసారి ప్రత్యేక హోదా అంశం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు.