Begin typing your search above and press return to search.

ఐ ప్యాక్ జగన్ ని మోసం చేసిందా ?

మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో జనాల్లో అసంతృప్తి ఏ రేంజిలో ఉందో ఐ ప్యాక్ వైసీపీ అధినేత జగన్ కి చెప్పకుండా దాచింది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 7:28 AM GMT
ఐ ప్యాక్ జగన్ ని మోసం చేసిందా ?
X

ఐప్యాక్ గత రెండు ఎన్నికల్లోనూ జగన్ కి పనిచేసింది. 2019లో ఐ ప్యాక్ ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఆధ్వర్యంలో పనిచేసింది. రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. ఈసారి ఆయన శిష్య బృందం నేతృత్వంలో పనిచేసింది. దాంతో కనీ వినీ ఎరుగని తీరులో పిడుగు లాంటి రిజల్ట్ వచ్చింది. ఎక్కడ 151 సీట్లు మరెక్కడ 11 సీట్లు. వైసీపీ వైభోగం నుంచి పాతాళానికి దిగజారిపోయింది.

మరి ఇంతలా ప్రజా వ్యతిరేకత ఉంటే వైసీపీ నియమించుకున్న ఐ ప్యాక్ టీం ఏమి చేస్తోంది అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. తమను పెట్టుకున్న వైసీపీకి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అందించి అలెర్ట్ చేయాల్సిన బాధ్యత ఐ ప్యాక్ కి ఉంది కదా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం.

గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలియాలనే కదా ఐ ప్యాక్ టీం ని పెట్టుకున్నది. మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో జనాల్లో అసంతృప్తి ఏ రేంజిలో ఉందో ఐ ప్యాక్ వైసీపీ అధినేత జగన్ కి చెప్పకుండా దాచింది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అంతే కాదు వాలంటీర్లతోనే మొత్తం పని అవుతుందని చెప్పింది ఎవరు అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. ఐ ప్యాక్ సలహా మీదనే వాలంటీర్లను రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించింది అని అంటున్నారు. అలా కాదు పార్టీ చెబితేనే అలా వాలంటీర్లు రాజకీయంగా కూడా వేలూ కాలూ పెట్టారు అని కూదా ఐ ప్యాక్ వైపు నుంచి వాదన వినిపిస్తోంది.

ఎవరు చెప్పడం అన్నది కాదు కానీ వాలంటీర్ల వల్లనే మొత్తం వైసీపీ కుప్పకూలింది అని అంటున్నారు. ఏకంగా పార్టీతో జనాలకు కనెక్షన్ కట్ అయింది అని అంటున్నారు. అంతా బాగుంది అన్న మూడ్ తోనే పార్టీ ముందుకు పోయిందని ఎవరు ఎవరికీ బాధ్యులు లేని విధానంతో ఒక రకమైన గందరగోళం అయోమయంతోనే అంతా సాగిందని అంటున్నారు. అది కాస్తా చివరికి వైసీపీ భారీ ఓటమికి దోహదపడింది అని అంటున్నారు.

దేశంలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎమ్మెల్యేలకు క్యాడర్ తో కనెక్షన్ లేదు. క్యాడర్ కి జనంతో కనెక్షన్ లేదు. ఇక ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రితో ఏ మాత్రం కనెక్షన్ లేదు ఇలా వైసీపీ దారం తెగిన గాలిపటం లా అయిదేళ్ల కాలం గడిపిందని అంటున్నారు. అధికారం ఉంది కాబట్టి అంతా ఓకే అనుకున్నా ఇపుడే అసలైన పరిస్థితులు తెలుస్తుంది అని అంటున్నారు.

టోటల్ గా చెప్పాలీ అంటే హై కమాండ్ కి క్యాడర్ కి మధ్య ఉండాల్సిన అందమైన బంధం ఒక వంతెన లాంటి సంబంధం పూర్తిగా తెగిపోయాయి. హై కమాండ్ అని పేరు చెప్పుకుంటూ కొందరు పెద్దలు చేస్తున్న పెద్దరికం పెత్తనం ఇంకా అలాగే కొనసాగితే మాత్రం వైసీపీ జీవితంలో అధికారంలోకి రాదు అని కూడా వైసీపీ హితైషులే తేల్చేస్తున్న వైనం కనిపిస్తోంది.

ఇక ప్రశాంత్ కిశోర్ వైసీపీ ఓటమి పాలు అవుతుంది అని ఒకటికి పదిసార్లు అంత ధీమాగా ఎలా చెప్పగలిగారు అన్నది కూడా వైసీపీ పెద్దలు ఎక్కడా ఏ సమయంలోనూ కనిపెట్టలేకపోయారు అని అంటున్నారు. కనీసం అది నిజమా కాదా అని చెక్ చేసుకునే సీన్ కూడా లేకుండా పోయింది అని అంటున్నారు. పైగా పీకేని పట్టుకుని వైసీపీ నేతలు దారుణంగా విమర్శించడానికి కాలం వెచ్చించారు తప్ప పీకే చెప్పేది నిజమేనా అలా అయితే ఏమి చేయాలి అన్నది కూడా కనీస మాత్రంగా అయినా ఆలోచించలేక పోయారు అని అంటున్నారు.

నిజానికి పీకేకి ఐ ప్యాక్ టీం లోని కీలక వ్యక్తులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. వైసీపీకి జగన్ కి చెప్పకుండా దాచిన ఘోర ఓటమి సమాచారాన్ని పీకేకి వారు చాలా ముందుగానే చెప్పేసారు అని అంటున్నారు. ఆ ఆధారాలతోనే పీకే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు అని గుర్తు చేసుకుంటున్నారు.

అలా పీకే నుంచి జగన్ ఓటమి ఖాయం అని చెప్పిన తరువాతనే జగన్ పూర్తిగా వీక్ అయ్యారని అంటున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పింది నూరుపాళ్ళు నిజం అని అంటున్నారు. జగన్ కి ఏమీ చెప్పకుండా ఏమీ తెలియనీయకుండా పూర్తిగా మబ్బుల్లో ఉంచేశారు అని అంటున్నారు.

ఇక జగన్ కి పార్టీ జనాలకు ఎమ్మెల్యేలకు మధ్య ఒక అగాధం ఏర్పడింది అని తెలిసింది అంటున్నారు. జగన్ వద్దకు ఎవరు వెళ్ళినా ఫలనా ఆఫీసర్ ని కలువు అని చెప్పడం ద్వారా మొత్తం అధికార యంత్రాంగం అంతా జగన్ పరోక్షంలో సాగింది. ఆయనకు కీలక సమాచారం అటు పార్టీకి సంబంధించింది ఏదీ తెలియనీయలేదు అని అంటున్నారు.

మొత్తానికి ఈ భారీ ఓటమితో వైసీపీ ఏ విధంగా అయిదేళ్ళూ నీటి బుడగ లాంటి వ్యవస్థతో నడిచింది అన్నది కళ్లకు కట్టినట్లుగా అందరికీ అర్ధం అవుతోందిట. మరి అందరికీతెలిసింది జగన్ కి తెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు అని అంటున్నారు వైసీపీని ఈ రోజు నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసుకుని రావాలి. అందరికీ మళ్ళీ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. నమ్మకం తప్పిన పార్టీ క్యాడర్ ని దారికి తేవాలి. ఇది కష్టమైతే కావచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదు. అందువల్ల పార్టీ ఇప్పటికైనా ఆవిధంగా పనిచేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.