దేశ చరిత్రను మార్చే చాన్స్ కోల్పోయిన కేసీఆర్
ఇదంతా, తమిళ అగ్ర నటుడు దళపతి విజయ్ తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ స్థాపించడం గురించి!
By: Tupaki Desk | 22 Aug 2024 7:30 PM GMTతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ టైం బ్యాడ్ కాకపోతే... అందివచ్చిన అవకాశాన్ని కళ్ల ముందున్నా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉండిపోయారు మరి!. దేశ చరిత్రను మార్చే పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయంలో.. దేశ్ కీ నేతగా ప్రొజెక్ట్ చేసుకున్న కేసీఆర్, ఇప్పుడు ఆ పరిణామాలన్నీ పట్టనట్లుగా, వార్తలకు ఎక్కడో దూరంగా ఉండిపోయారు. ఇదంతా, తమిళ అగ్ర నటుడు దళపతి విజయ్ తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ స్థాపించడం గురించి!
తమిళగ వెట్రి కజగం ప్రారంభిస్తున్నట్లు ఈ ఏడాది 2024 ఫిబ్రవరిలో ప్రకటించిన విజయ్ నేడు చెన్నై పనైయుర్ లోని పార్టీ కార్యాలయంలో తన పార్టీ జెండాను, గుర్తును ఆవిష్కరించారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులతో పాటు మద్దతుదారులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విజయ్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేయిస్తూ కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను తాము తొలగిస్తామని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమానహక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తామని ప్రకటించారు.
విజయ్ పొలిటికల్ ఎంట్రీలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన గులాబీ పార్టీది ఒక పాత్ర ఉందనే విషయం రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారిలో కొద్ది మందికి గుర్తుండి ఉంటుంది. బీఆర్ఎస్ పేరుతో దేశ రాజకీయాలలోకి కేసీఆర్ ఎంట్రీ సమయంలో, 2022 సంవత్సరంలో విజయ్ ఒకసారి హైదరాబాద్ వచ్చి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పరిపాలన గురించి విజయ్ మెచ్చుకున్నారని, అంతేకాకుండా వారి మధ్య రాజకీయాలు చర్చకు వచ్చాయని, మరీ ముఖ్యంగా కేసీఆర్ పార్టీ ప్రారంభించడం, రాష్ట్రం సాధించేలా ముందుకు సాగడం, దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటివి విజయ్‌కు తెగ నచ్చేశాయని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించుకుంది.
కట్ చేస్తే, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం దూరం అవడం, 2024లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చెంది అన్ని నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోవడం, పలు చోట్ల డిపాజిట్లు కూడా దక్కకపోవడం.. తెలిసిన సంగతే. తదనంతరం గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పరిమిత స్థాయిలోనే భాగం పంచుకుంటున్నారు. మరోవైపు, కేసీఆర్ దగ్గర రాజకీయ పాటలు నేర్చుకున్న విజయ్ మాత్రం, పార్టీ పెట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో... కేసీఆర్ సాబ్... తన శిష్యుడే తమిళనాడు రాజకీయాల్లో ఏలనున్నాడని చెప్పుకునే అవకాశం కోల్పోయారని పలువురు కామెంట్లు చేసుకున్నారు.