Begin typing your search above and press return to search.

సీఎం రమేశ్ కు జైల్లో ఉన్న బీటెక్ రవి ఆ మాటలు చెప్పారా?

తనను అదుపులోకి తీసుకోవటానికి ముందు తనను కిడ్నాప్ చేసి మూడు గంటల పాటు చీకట్లో తిప్పుతూ చివరకు ఒక గదిలో బంధించి ఉంచినట్లుగా చెప్పినట్లుగా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 12:30 PM GMT
సీఎం రమేశ్ కు జైల్లో ఉన్న బీటెక్ రవి ఆ మాటలు చెప్పారా?
X

సంచలన విషయాల్ని విషయాల్ని వెల్లడించారు సీఎం రమేశ్. మాజీ ఎంపీగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా జైల్లో ఉన్న పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జి బీటెక్ రవిని ములాఖాత్ లో కలిశారు. ఈ సందర్భంగా పోలీసులు తనను అరెస్టు చేసిన తీరు.. తనకు ఎదురైన అనుభవాల గురించి బీటెక్ రవి తనతో చెప్పినట్లుగా సీఎం రమేశ్ వెల్లడించారు. తనను అదుపులోకి తీసుకోవటానికి ముందు తనను కిడ్నాప్ చేసి మూడు గంటల పాటు చీకట్లో తిప్పుతూ చివరకు ఒక గదిలో బంధించి ఉంచినట్లుగా చెప్పినట్లుగా పేర్కొన్నారు.

తనను కిడ్నాప్ చేసిన వార్త మీడియాలో రావటంతో చివరకు వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించి.. తప్పుడు కేసు నమోదు చేసినట్లుగా ఆరోపించారు. ములాఖత్ సందర్భంగా తనతో చెప్పిన వివరాల్ని సీఎం రమేశ్ వెల్లడించారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకున్న వేళ.. తనకు వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పారన్నారు.

పులివెందుల నుంచి కడప వస్తున్న తనను వాహనాల తనిఖీ పేరుతో యోగి వేమన వర్సిటీ సమీపంలో ఆపారని.. తాను కిందకు దిగగా సీఎం అశోక్ రెడ్ి టీం తనను వారి వాహనంలోకి ఎక్కించుకొని తీసుకెళ్లారన్నారు. ‘చీకట్లో తిప్పుతూ.. పాడుబడిన గదిలోకి వెళ్లి చంపేందుకు ప్రయత్నించారు. కిడ్నాప్ అని మీడియాలో ప్రచారం జరిగింది.దీంతో పోలీసులు వల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసు పెట్టారు. పులివెందులలో టీడీపీ కార్యాలయాన్ని ఎందుకు కట్టావు? డబ్బులు ఎవరు ఇచ్చారు? వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ పై పోటీ చేసే ధైర్యం ఉందా? నువ్వు బతికి ఉంటే కదా పోటీ చేసేది? ఇప్పుడే చంపేస్తాం’’ అని పోలీసులు తనను బెదిరించినట్లుగా బీటెక్ రవి తనకు చెప్పినట్లుగా సీఎం రమేశ్ చెప్పారు.

వచ్చేఎన్నికల్లో మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత పోటీ చేస్తున్నారా? అని బీటెక్ రవిని పోలీసులు అడిగినట్లుగా పేర్కొన్నారు. రవి ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని డేటాను డౌన్ లోడ్ చేసుకున్నట్లుగా సీఎం రమేశ్ వెల్లడించారు. సీఐ అశోక్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆయన వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలోనే అశోక్ రెడ్డి వ్యవహారాన్ని.. అతడి రియల్ ఎస్టేట్ బండారాన్ని బయటపెడతామని సీఎం రమేశ్ చెప్పారు.