బీఆర్ఎస్ లాగానే వైసీపీకి ఆ ముప్పు ?
అప్పటికీ కేసీఆర్ మీద బాగానే జనాల్లో అభిప్రాయం ఉంది అని చెప్పుకున్నారు.
By: Tupaki Desk | 25 May 2024 3:15 AM GMTతెలంగాణాలో బీఆర్ఎస్ కి ఒక తీవ్ర వ్యతిరేకత కొంప ముంచింది. అదేంటి అంటే ఎమ్మెల్యేల మీద జనాలలో ఉన్న వ్యతిరేకత. ఎమ్మెల్యేలు లోకల్ గా జనాలతో పెద్దగా కనెక్ట్ కాకపోవడం పట్టించుకోకపోవడం వీలున్న కాడికి దండుకోవడం, అవినీతి అక్రమాల వల్లనే జనాలు వారి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ కి ఓట్లు గుద్దేశారు. అప్పటికీ కేసీఆర్ మీద బాగానే జనాల్లో అభిప్రాయం ఉంది అని చెప్పుకున్నారు.
కానీ జనాలు చూసేది అధినాయకుడిని కాదు, తమ ఎమ్మెల్యేలేనే. ఆ సంగతి తెలిసి మేలుకుని జగన్ చాలా చోట్ల భారీ ఎత్తున లోకల్ ఎమ్మెల్యేలను మార్చేశారు. అలా అతి పెద్ద ఎక్సర్ సైజ్ చేశారు. అయితే చాలా చోట్ల అంటే ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రాలో మాత్రం నూటికి తొంబై తొమ్మిది శాతం పాతవారికే తిరిగి టికెట్లు ఇచ్చారు. ఇలా చూస్తే వంద మంది దాకా సిట్టింగులు తిరిగి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు.
దాంతో వీరి పట్ల జనంలో వ్యతిరేకత బాగా ఉంది అని అంటున్నారు. అదే ఇపుడు దెబ్బ తీసే చాన్స్ ఉంది అని అంటున్నారు జగన్ అంతే ఇష్టం. ఆయన పధకాలు మేము అందుకున్నాం, కానీ ఎమ్మెల్యేల మీదనే మా కోపం అందుకే ఓటేయలేదు అని కొందరు చెబుతూంటే కసి కోపంతో ప్రత్యర్ధి పార్టీలకే ఓటు వేశామని మరి కొందరు చెప్పడంతో పోలింగ్ అనంతరం జరుగుతున్న ఈ పోస్ట్ మార్టం అధికార పార్టీని తీవ్రంగా కలవర పెడుతోంది అని అంటున్నారు.
పైగా వీరు అంటున్న మాట కూడా బెంగ పుట్టేలా ఉంది. మా ఒక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఓడిపోవాలి. మిగిలిన చోట్ల ఎటూ జగన్ వేవ్ ఉంటుంది కాబట్టి ఆయనే సీఎం కావాలి అని. ఇలా ప్రతీ వారూ చేస్తే కనుక అపుడు వైసీపీకి అతి పెద్ద ముప్పుగా మారుతుంది అని అంటున్నారు. ఎన్నికలలో వైసీపీ పెద్దలు చాలా మాటలు చెప్పారు.
ఎమ్మెల్యేలు ఎవరు అయినా జనాలు చూడరని, మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో జగన్ నే చూసి ఓటు వేస్తారు అని. మాటలకు ఇది బాగుంటుంది కానీ ఎమ్మెల్యేలను చూడకుండా వారి పనితీరుని బేరీజు వేయకుండా గుడ్డిగా ఓట్లు వేసే వారు చాలా తక్కువ. ఇక హోరా హోరీ అన్నదగిన నియోజకవర్గాలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారిని దింపినా ఆ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని కొత్త అభ్యర్ధి వస్తే వారి మీద కూడా జనాలు ఇదే రకమైన వ్యతిరేకత చూపించారని అంటున్నారు.
ఏది ఏమైనా ఈసారి టగ్ ఆఫ్ వార్ గా జరిగిన ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకం. అలాగే ప్రతీ సీటూ ఇంపార్టెంట్ గా మారింది. అయినా సరే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే అది అంతిమంగా కొంప ముంచుతుందా అన్న చర్చకు తెర లేస్తోంది. చూడాలి మరి ఫలితాలలో ఎలాంటి తమాషాలు చోటు చేసుకుంటాయో.