అక్కడ సంప్రదాయం... భార్యలే భర్తలకు పాకెట్ మనీ ఇస్తున్నారట!
అయితే తాజాగా జపాన్ లోని చాలా ప్రాంతాల్లో వారి సంప్రదాయంగా చెబుతున్న ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 27 July 2024 2:30 PM GMTసాధారణంగా ఒకప్పుడు (ఇప్పటికీ కొన్ని చోట్ల!) భర్త బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే.. భార్య ఇంటి బాధ్యతలు చక్కబెట్టేది. భర్త ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బును ఇంట్లో ఇస్తే.. దాన్ని పొదుపుగా ఖర్చు చేసి, కొంతమొత్తం ఆదా చేసేవారు! అయితే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు.. పెరుగుతున్న ఖర్చుల విషయంలో వేడినీళ్లకు చన్నీళ్లు సాయంలా ఉంటున్నారు.
అయితే తాజాగా జపాన్ లోని చాలా ప్రాంతాల్లో వారి సంప్రదాయంగా చెబుతున్న ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... అక్కడ భార్యలే భర్తలకు పాకెట్ మనీ ఇస్తారంట. పైగా.. ఆ నెలలో భార్య ఎంత పాకెట్ మనీ ఇస్తే భర్త అందులోనే సర్ధుకోవాలంట. పైగా ఈ సంప్రదాయానికి ఓ సరికొత్త పేరు కూడా ఉందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది!
అవును... జపాన్ లోని పలు ప్రాంతాల్లో భర్తలు సంపాదించిన మొత్తాన్ని భార్యల చేతిలో పెడతారంట. అప్పుడు వారు ఆ డబ్బును ఇంటి ఖర్చులు, పిల్లల చాదువులు, ఇతర ఖర్చులతో పాటు సేవింగ్స్ వంటి విషయాలకు ఉపయోగిస్తారంట. ఇదే సమయంలో తన భర్త సంపాదించిన జీతంలో కొంత సొమ్మును తిరిగి అతనికి పాకెట్ మనీగా ఇస్తారట. ఈ సంప్రదాయాన్ని జపాన్ లో "కొజులై" అని పిలుస్తారని చెబుతున్నారు.
దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో మొదటిది... భర్త ఉద్యోగ భాధ్యతలు తీసుకుంటే, భార్య ఇంటి ఆర్థిక నిర్వహణ బాధయ్తలు తీసుకోవాలనేది వారి సంప్రదాయం కాగా.. సంపాదించిన మొత్తం భార్య చేతిలో పెట్టడం వల్ల ఇద్దరి మధ్య నమ్మకం, పారదర్శకత పెరిగి వారి వైవాహిక బంధం మరింత బలంగా ఉంటుందనే నమ్మకం రెండో కారణంగా చెబుతున్నారు.
ఇదే క్రమంలో... ఇంటి బడ్జెట్ విషయంలో స్త్రీలకు బాధ్యతలు ఇవ్వడం వల్ల అనవసరపు ఖర్చులు నివారించే అవకాశం ఉంటుందని వారు బలంగా నమ్ముతారంట. ఇలా మూడు కారణాలనూ నమ్ముతూ జపాన్ లో సుమరు 74% మంది మహిళలు ఇంటిపనులు చూసుకుంటూ డబ్బు ఆదా చేస్తుండగా.. భర్తలు బయటకు వెళ్లి సంపాదించుకుని వస్తున్నారంట.