Begin typing your search above and press return to search.

మెజార్టీ తక్కువ.. ఓట్లు ఎక్కువ.. ఏపీ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు ఆయనకే!

పురుష అభ్యర్థుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్ 70.24% ఓట్లు సాధించారు.

By:  Tupaki Desk   |   16 July 2024 7:45 AM GMT
మెజార్టీ తక్కువ.. ఓట్లు ఎక్కువ.. ఏపీ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు ఆయనకే!
X

అత్యంత హోరాహోరీగా సాగి.. అంతే స్థాయిలో సంచలన ఫలితాలు వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి..? అనేది ఇప్పటికే ఓ అంచనా ఉంది. దీనిపైనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. అయితే, కూటమిగా పోటీ చేసిన టీడీపీ-జనసేన-బీజేపీకి ఏకంగా 55.30 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే వైసీపీ (39.37 శాతం) కంటే 15 శాతం అధికంగా ఓట్లు కూటమికి పడ్డాయి. ఇవన్నీ పార్టీపరంగా తీసిన లెక్కలు. మరి అభ్యర్థుల్లో ఎవరికి అత్యధిక శాతం ఓట్లు పోలయ్యాయంటే..?

అత్యధికం వీరే..

పురుష అభ్యర్థుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్ 70.24% ఓట్లు సాధించారు. మరెవరికీ సాధ్యం కానంతగా ఈయనకు ఓట్లు పడ్డాయి. ఇక మహిళా అభ్యర్థుల్లో విజయనగరం నుంచి పోటీచేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజుకు అత్యధికంగా 64.21 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చింది మాత్రం గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ యాదవ్ కు కావడం గమనార్హం. ఈయనకు 95,235 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 1,57,703 ఓట్లు పోలవగా.. పల్లా శ్రీనివాస్ యాదవ్ కు 67.30 శాతం ఓట్లు పడ్డాయి. కానీ, విశాఖ దక్షిణలో వంశీకృష్ణ ఆధిక్యం 64,594 ఓట్లు. ఈ వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది.

అత్యల్పం వీరే..

అత్యల్ప ఓట్ల తేడాతో నెగ్గిన వారిలో ఇద్దరూ టీడీపీ వారే. వీరు.. మడకశిర అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు (0.19%), గిద్దలూరు అభ్యర్థి అశోక్‌రెడ్డి (0.47%). కాగా , 175 మంది ఎమ్మెల్యేల్లో రికార్డు స్థాయిలో 22 మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ 40 శాతం పైగా ఓట్లు లభించడం గమనార్హం. మరోవైపు ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ ఓట్ల శాతాల్లో డబుల్ డిజిట్ దాటాయి. జనసేన (6.87)కు తక్కువ శాతమే వచ్చినా.. గేమ్ చేంజర్ ఆ పార్టీనే అయింది. 21 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలిచింది. ఇక

బీజేపీ (2.83), కాంగ్రెస్‌ (1.72%), నోటా (1.09%), బీఎస్పీ (0.60%), సీపీఎం (0.13%), సీపీఐ (0.04%) ఇతర పార్టీలకు 1.75% ఓట్లు పడ్డాయి. టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో నోటాకు అత్యధికంగా 3.79% ఓట్లు పడడం గమనార్హం. నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డ నియోజకవర్గాల్లో టెక్కలి తర్వాత సాలూరు (3.63%), రంపచోడవరం (3.45%) ఉన్నాయి.