Begin typing your search above and press return to search.

వినుకొండ రషీద్ మర్డర్ వెనుక అంత కథ ఉందట

రెండు రోజుల క్రితం వినుకొండలో జరిగిన రషీద్ మర్డర్ విషయంలోనూ అలాంటి ప్రచారమే జరుగుతోంది.

By:  Tupaki Desk   |   19 July 2024 3:54 AM GMT
వినుకొండ రషీద్ మర్డర్ వెనుక అంత కథ ఉందట
X

ఇదిగో తోక అంటే.. అదిగో పులి అన్నది పాత మాట. తోక లేకుండానే అదిగో పులి.. ఇదిగో వీడ్ని తినేసిందంటూ తమకు నచ్చినట్లుగా వార్తల వంటకాన్ని వండేయటం.. వాటిని తమకు తోచినట్లుగా ఏదో ఒక మాధ్యమం ద్వారా తీసుకెళ్లటం.. దానికి సోషల్ మీడియాలో ప్రచారాన్ని కల్పించటం ద్వారా అబద్ధాన్ని నిజంగా మార్చే ప్రయత్నం చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో.. ఏదైనా ఘటన జరిగినప్పుడు అసలేం జరిగిందన్నది పక్కన పెట్టి.. జరగనిది ఏదో జరిగినట్లుగా భావించటం అంతకంతకూ పెరుగుతోంది. రెండు రోజుల క్రితం వినుకొండలో జరిగిన రషీద్ మర్డర్ విషయంలోనూ అలాంటి ప్రచారమే జరుగుతోంది.

వైసీపీకి చెందిన రషీద్ ను టీడీపీ మూక చంపేసిందన్న వాదనను వైసీపీ వినిపిస్తోంది. ఈ రోజు (శుక్రవారం) హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళుతున్నారు. ఇదే సమయంలో రషీద్ ను హత్య చేసిన షేక్ జిలానీ ఎవరు? రషీద్ - జిలానీ మధ్యనున్న సంబంధం ఏమిటి? హత్య వరకు విషయం ఎందుకు వెళ్లింది? అన్నది వినుకొండకు చెందిన వారిని ఎవరిని అడిగినా బోలెడన్ని విషయాలు చెబుతారు. తొలిఏకాదశి రోజున రషీద్ అనే యువకుడ్ని కొబ్బరిబొండాం కత్తితో హత్య చేసిన షేక్ జిలానీ.. అంతటి పగ ఎందుకు పెంచుకున్నాడు? అన్నది ఒక ప్రశ్న అయితే.. తొలి ఏకాదశి రోజునే హత్య చేయటానికి బలమైన కారణం ఉందన్న విషయం వినుకొండలో ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి.

రాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టేసి.. వినుకొండలో జరిగిన రషీద్ మర్డర్.. దాని వెనుకున్న బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవాలంటే కొన్నేళ్ల ముందుకు వెళ్లాలి. అప్పుడు మాత్రమే ఈ హత్యకు నేపథ్యం తెలుస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే.. రషీద్ మర్డర్ దారుణం. అలాంటివి జరగకూడదని బలంగా నమ్ముతున్నాం. కాకుంటే.. ఏదైనా దారుణం జరిగినప్పుడు దాని వెనుకన్న విషయాల్లోకి వెళ్లకుండా.. పైపై విషయాలు.. ప్రచారంలోకి వచ్చిన వివరాల్ని మాత్రమే చూస్తే..అసలు నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా కనిపిస్తాయి.

హత్యకు గురైన రషీద్.. హత్యకు పాల్పడిన షేక్ జిలానీలు ఇద్దరూ ఒకప్పుడు స్నేహితులే. ఈ ఇద్దరు యువకుల మధ్య చంపుకునే శత్రుత్వం ఎందుకు వచ్చిందన్నది ఆసక్తికరం. ఈ ఇద్దరు యువకులు వైసీపీలో క్రియాశీలంగా పని చేసే వారే. వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అండదండలతో వినుకొండలో హడావుడి చేసే పీఎస్ ఖాన్ గ్యాంగ్ లో రషీద్.. జిలానీలు మెంబర్లు. అయితే.. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కాలక్రమంలో ఈ ఇద్దరు స్నేహితుల మధ్య అధిపత్య పోరు మొదలైంది. దీంతో వీరి దారులు వేరయ్యాయి.

అక్కడి నుంచి నేను గొప్పంటే.. నేను గొప్ప.. అన్నది షురూ అయ్యింది. అది కాస్తా వారిద్దరి మధ్య స్నేహాన్ని చిదిమేసి.. చంపుకునే వరకు వెళ్లింది. ఈ స్టోరీలో ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. వినుకొండలో ప్రతి ఏడాది తొలి ఏకాదశి పండుగ రోజు ‘కొండ తిరునాళ్లు’ నిర్వహిస్తుంటారు. గత ఏడాది (2023) తిరునాళ్ల సందర్భంగా గ్యాంగ్ లీడర్ ఖాన్ ఒక లాడ్జిలో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో గొడవ జరిగింది. ఆ రోజు జిలానీ బీర్ బాటిల్ తో దాడి చేయటంతో ఒక కుర్రాడు గాయపడ్డాడు. ఈ ఉదంతంలో గ్యాంగ్ లీడర్ ఖాన్.. గాయపడిన కుర్రాడికి చెందిన రషీద్ కు మద్దతుగా నిలిచాడు.

ఇదిలా ఉంటే.. బీర్ బాటిల్ తో దాడికి పాల్పడిన జిలానీ ఇంటిపై జులైలో రషీద్ తో పాటు.. ఖాన్ గ్యాంగ్ లోని కొందరు జిలానీ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న బుల్లెట్ బండిని తగలపెట్టారు. దాడి వేళలో జలానీ ఇంట్లో లేడు. అతడి అన్న జిమ్ జానీ ఉండటంతో అతడ్ని కొట్టారు. దీనిపై అప్పట్లో పోలీసులకు కంప్లైంట్ అందినా.. అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి జోక్యంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ఇంటిపై జరిగిన దాడిపై కేసులు కట్టాలని జిలానీ ప్రయత్నించాడు. కానీ. కుదర్లేదు సరికదా..జిలానీ మీదే హత్యయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. జిలానీ.. అతడి సోదరుడి మీద మరిన్ని కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. దీంతో.. తన పరిస్థితికి కారణమైన రషీద్ మీద జిలానీ కక్ష పెంచుకున్నాడు. కట్ చేస్తే.. ఈ ఏడాది తొలి ఏకాదశి రోజున తనకు జరిగిన దానికి బదులు తీర్చుకునేందుకు కొబ్బరిబోండాల కత్తితో నడి వీధిలో రషీద్ను జిలానీ నరికి చంపేశాడు. ఈ దారుణ హత్య వెనుక స్టోరీ ఇంత ఉంది. ఏడాదికి పైగా నేపథ్యముంది. వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఎపిసోడ్ మొత్తం వ్యక్తిగత కక్షలతోనే అయినప్పటికీ దానికి రాజకీయ రంగును పులిమి.. నానా హడావుడి చేస్తున్నారు. రషీద్ మర్డర్ పూర్తిగా వ్యక్తిగత కక్షలే కారణమన్న విషయాన్ని గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి.. పల్నాడు ఎస్పీ కే శ్రీనివాసరావులు చెబుతున్నారు. అయినప్పటికీ.. ఇది రాజకీయ హత్యగా ప్రచారం చేస్తుండటం గమనార్హం.