వైరల్... వైట్ హౌస్ లో ట్రంప్ డైట్ కోక్ బటన్ ప్రత్యక్షం!
ఈ క్రమంలో రెండోసారి వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆయన అక్కడ మరోసారి డైట్ కోక్ బటన్ ను ఏర్పాటు చేసుకున్నారు.
By: Tupaki Desk | 21 Jan 2025 9:58 AM GMTడొనాల్డ్ ట్రంప్ కోకాకోలా కూల్ డ్రింక్స్ ప్రియుడనే సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గతంలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొనగా.. ట్రంప్ మంచి నీళ్లు తాగడం తాను ఎప్పుడూ చూడలేదంటూ యూ.ఎఫ్.సీ. సీఈఓ డానా వైట్ దానికి బలం చేకూర్చారు. ఈ సమయంలో వైట్ హౌస్ లో మరోసారి డైట్ కోక్ బటన్ ఏర్పాటు చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్.
అవును... అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండోసారి వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆయన అక్కడ మరోసారి డైట్ కోక్ బటన్ ను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి 2016లో ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు వైట్ హౌస్ లోని తన కార్యాలయంలో ఈ బటన్ ను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ క్రమంలో ఆయనకు అవసరమైనప్పుడు ఆ బటన్ ప్రెస్ చేస్తే.. వెంటనే ఆయన టెబుల్ పైకి డైట్ కోక్ ని తెచ్చి పెట్టేవారు. దీనిపై గతంలో స్పందించిన ట్రంప్... తాను దాన్ని నొక్కిన ప్రతీసారీ అంతా కొంచెం భయపడతారు అని జోక్ కూడా చేశారు. అయితే... 2021 ఎన్నికల్లో జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ బటన్ ను అక్కడ నుంచి తీసేశారు.
ఇప్పుడు మరోసారి అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వేళ.. తన కోక్ బటన్ ను తిరిగి ఏర్పాటు చేయించుకున్నారు. ఇటీవల కాలంలో ట్రంప్ రెగ్యులర్ గా కోక్ తాగుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు!
కాగా... ఇటీవల కోకా కోలా కంపెనీ డొనాల్డ్ ట్రంప్ కు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఓ కోక్ బాటిల్ ను డిజైన్ చేసింది. ఆ స్పెషల్ డైట్ కోక్ బాటిల్ ను కోకా కోలా కంపెనీ ఛైర్మన్, సీఈవో జేమ్స్ క్వీన్సీ స్వయంగా దాన్ని తీసుకెళ్లి డొనాల్డ్ ట్రంప్ కు అందజేశారు.
ఈ స్పెషల్ డైట్ కోక్ బాటిల్ బ్లూ, గ్రే, రెడ్ లేబుల్ పై "అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే ట్రంప్ ప్రమాణస్వీకారం" అని రాసి.. “20 జనవరి 2025” అని తేదీ వేసి ఉంది. దీన్ని ట్రంప్ గౌరవార్థం రెడ్ కలర్ బాక్స్ లో పెట్టి ఇచ్చారు.