Begin typing your search above and press return to search.

చంద్రబాబు అలా .. రేవంత్ ఇలా !

అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు ఒక ఏడాది పాటు పాత పుస్తకాలనే కొనసాగించారని, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ సంకుచిత దృక్పథం వళ్ల ప్రజా ధనం వృధా అవుతుందని విమర్శలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 Jun 2024 3:00 AM GMT
చంద్రబాబు అలా .. రేవంత్ ఇలా !
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 స్థానాలకు గాను 164 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించి గా మెగా డీఎస్సీ పై తొలి సంతకం, ల్యాండ్‌ అండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం, పెన్షన్లు రూ. 4 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పై నాలుగో సంతకం, స్కిల్‌ సెన్సెస్‌పై ఐదో సంతకం చేశారు.

అయితే ఈ రోజు నుండి ఏపీలో నేటి నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే జగన్ హయాంలో ఉన్న విద్యాదీవెన పథకం కింద 9 లక్షల మంది విద్యార్థులకు జగన్ ఫోటోలతో కూడిన కిట్లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వాటిని పంచడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో వాటిని యధావిధిగా విద్యార్థులకు పంపాలని చంద్రబాబు ఆదేశించడం అందరినీ ఆకర్షించింది.

అదే విధంగా తెలంగాణలో గత డిసెంబరులో రేవంత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇప్పటి వరకు విద్యార్థులకు పుస్తకాలు తయారు చేసే కమిటీని నియమించనందున యధావిధిగా కేసీఆర్ ప్రభుత్వంలో ముద్రించిన పుస్తకాలే అచ్చయ్యాయి. అందులో ముఖ్యమంత్రిగా కేసీఆర్ సందేశం, విద్యా శాఖా మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి సందేశాలు ఉన్నాయి. ఈ విషయం బయటకు రావడంతో ప్రభుత్వం సీరియస్ గా పుస్తకాలను వెంటనే వెనక్కి తెప్పించాలని విద్యా శాఖను ఆదేశించింది.

2014లో ఆంధ్ర - తెలంగాణ విడిపోయినప్పుడు కూడా కొత్త పుస్తకాలు రూపొందించని నేపథ్యంలో సంవత్సరం పాటు పాత పుస్తకాలనే విద్యార్తులు చదువుకున్నారని, కేవలం కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డి సందేశాలు ఉన్నాయని పుస్తకాలు వెనక్కు తెప్పించడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సిలబస్ నే చదువుకున్నాం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎడిటర్లు,ఆనాటి ముఖ్యమంత్రి,విద్యాశాఖ మంత్రి పేర్లు యధావిధిగా ఉన్నాయని అంటున్నారు.

అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు ఒక ఏడాది పాటు పాత పుస్తకాలనే కొనసాగించారని, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ సంకుచిత దృక్పథం వళ్ల ప్రజా ధనం వృధా అవుతుందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు పుస్తకాలు మార్చాలంటే కొత్త కమిటీ వేయాలని, దానికి సమయం లేదని, కొత్త కమిటీ వేసి వచ్చే ఏడాది కొత్త పుస్తకాలు తెచ్చి అందులో కొత్త ప్రభుత్వంలోని వాళ్ల పేర్లు పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. తమిళనాడులో డీఎంకె అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జయలలిత ఫోటో ఉన్న పుస్తకాలను యధావిధిగా కొనసాగించారని ఉదహరిస్తున్నారు.