Begin typing your search above and press return to search.

సీఎంతో సినీ పెద్దలు.. తెరపైకి ఫేక్ వార్తలు!

ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   26 Dec 2024 12:13 PM GMT
సీఎంతో సినీ పెద్దలు.. తెరపైకి ఫేక్ వార్తలు!
X

ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్సెస్ సర్కార్ అంటూ సాగుతున్న ప్రచారం పీక్స్ కి చేరిందని అంటున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా... స్పందించిన దిల్ రాజు... తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల తనకున్న విజన్ ను సీఎం తమతో పంచుకున్నారని.. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వంతో కలిసి పని చేయాలనే విషయంపై చర్చించినట్లు తెలిపారు. ఇదే సమయంలో... ఇండస్ట్రీ అభివృద్ధి అన్నదే తమ ముందున్న అతిపెద్ద లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్లు, సంక్రాంతి సినిమాలు అనేవి చాలా చిన్న విషయాలని.. ప్రభుత్వం అనేది చాలా పెద్దదని తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామని దిల్ రాజు చెప్పారు. ఇదే సమయంలో... ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య గ్యాప్ అనేది అపోహ మాత్రమే అని అన్నారు.

ఈ మీటింగ్ లో జరిగిన విషయాలు ఇవే అంటూ మీడియా ముందుకు వచ్చి వివరించారు. అయితే... దిల్ రాజు మీడియా సమావేశానికి ముందు.. సమావేశానికి సంబంధించి పలు విషయాలు మీడియాలో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరలు పెంపునకు సీఎం అంగీకరించలేదని బ్రేకింగ్స్ వచ్చాయి.

ఇదే సమయంలో 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటనపైనా ఘాటుగా స్పందించారని వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు నుంచి విడుదలైన ఓ ప్రకటన ఆసక్తిగా మారింది. సీఎం మీటింగ్ లో అసలు జరగనివి కూడా జరిగినట్లు వార్తలు వేస్తున్నారని మండిపడ్డారు!

అవును... సీఎంతో భేటీ అయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా పలు ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయని.. సీఎం మీటింగ్ లో అసలు జరగనివి జరిగినట్లు వార్తలు వేస్తున్నారని.. సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా జరిగిందని.. ఇందులో 0.5 శాతం కూడా నెగిటివ్ సౌండ్ లేదని.. సినిమా ఇండస్ట్రీ పట్ల సానుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్లు గురించి అసలు టాపిక్కే రాలేదని.. ప్రధానంగా.. ఈ సమావేశంలో పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియోలను తమకు ప్రదర్శించారనే ప్రచారం కూడా పుర్తిగా అవాస్తవమని దిల్ రాజు స్పష్టం చేశారు. బౌన్సర్ల విషయంలో డీజీపీ అకౌంటిబిలిటీ గురించి సూచించారని అన్నారు.

ఇదే సమయంలో... హైదరాబాద్ కు ఐటీ, ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమ కూడా అంతే కీలకంగా భావిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారని.. అదేవిధంగా.. గద్దర్ అవార్డ్స్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో అనుసంధానంగా జరగాలని సీఎం చెప్పారని ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ దిల్ రాజు అన్నారు!

దీంతో... సీఎంతో సినీ ప్రముఖుల భేటీకి సంబంధించి జరిగిన ప్రచారం అంతా కేవలం ప్రచారం మాత్రమే అయ్యి ఉండోచ్చనే చర్చ మొదలైందని అంటున్నారు!