దిల్ రాజు కీలక వ్యాఖ్యలు... 'పుష్ప' ప్రస్థావన లేకుండానే చర్చలు?
దిల్ రాజు... ఈ మధ్య జరిగిన కొన్ని అనివార్య సంఘటనల వల్ల సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోందని.. ఇది అపోహ మాత్రమే అని.. అన్నారు.
By: Tupaki Desk | 26 Dec 2024 9:57 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ రోజు భేటీ అయ్యారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 46 మంది ఈ భేటీలో పాల్గొన్నారని అంటున్నారు. అయితే.. ఈ భేటీలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, బెనిఫిట్ షో లకు సంబంధించిన చర్చ రాలేదని ఒకరంటే.. ‘వాటికి ఛాన్స్ లేదు’ అని సీఎం నొక్కి చెప్పారంటూ ప్రచారం తెరపైకి వచ్చింది.
అవును... తెలంగాణ సర్కార్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ సమావేశం జరిగింది. అయితే.. ఇంతకూ ఈ సమావేశంలో ఏయే విషయాలపై చర్చించారు..? ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయి..? ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కోరికలు వెల్లడయ్యాయి..? అనే విషయాలపై స్పష్టత కరువైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సమావేశం అనంతరం దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయని అంటున్నారు.
ఈ భేటీపై అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు... ఈ మధ్య జరిగిన కొన్ని అనివార్య సంఘటనల వల్ల సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోందని.. ఇది అపోహ మాత్రమే అని.. అన్నారు. ఇదే సమయంలో.. బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్లు అనేవి చిన్న విషయమని.. అది ముఖ్యం కాదని దిల్ రాజు స్పందించడం గమనార్హం.
ఇదే సమయంలో.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల తనకు ఉన్న విజన్ ను సీఎం రేవంత్ తమతో పంచుకున్నారని.. తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ది చెందడానికి ప్రభుత్వం, ఇండస్ట్రీ కలిసి పనిచేయాలనే దానిపై ఆయన చర్చించారని దిల్ రాజు తెలిపారు. ఇదే సమయంలో ఆ లక్ష్యానికి అనుగుణంగా తామంతా కలిసి వర్క్ చేస్తామని.. దిల్ రాజు తెలిపారు.
ఇక... ఇండియా సినిమా వాళ్లు మాత్రమే కాకుండా.. హాలీవుడ్ వాళ్లు కూడా హైదరాబాద్ కు షూటింగ్స్ చేసుకునేలా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చించారని.. దీనిపై ఇండస్ట్రీ మొత్తం మరోసారి చర్చించుకుని ఎఫ్.డీ.సీ. ద్వారా ఆయనకు సలహాలు, సూచనలు ఇస్తామని దిల్ రాజు వెల్లడించారు.
ఇదే సమయంలో.. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని.. ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ గా తాను బాధ్యతలు తీసుకుని వారం రోజులు అయ్యిందని.. ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే ఇక్కడ విషయమని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడం అనేది అజెండా అని దిల్ రాజు తెలిపారు.
దిల్ రాజు వ్యాఖ్యలు ఈ విధంగా ఉంటే... టాలీవుడ్ పెద్దలతో మీటింగ్ సమయంలో సీఎం ఆఫీసు నుంచి లీకులు వచ్చాయనే విషయం ఈ సందర్భంగా వైరల్ గా మారింది. బెనిఫిట్ షో, టిక్కెట్ రేట్ల పెంపు గురించి చర్చలు రాలేదని, అవి చిన్న విషయాలని దిల్ రాజు అంటుంటే.. మీడియాలో మాత్రం 'ఇకపై అలాంటివి ఉండవు' అంటూ సీఎం సూటిగా, స్పష్టంగా చెప్పారనే వార్తలు వైరల్ గా మారాయి.
మరోపక్క ఈ రోజు ఇండస్ట్రీతో జరిగిన సీఎం మీటింగ్ లో రేవంత్ స్పీచ్ ఫైర్ అని.. ఈ విషయంలో ముఖ్యమంత్రిలా కాకుండా, కామన్ మెన్ లా మాట్లాడారని.. ఆయన వ్యాఖ్యలకు అంతా ఫిదా అయ్యారని.. ఓ దర్శకుడు చెప్పారని చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో.. సంధ్య థియేటర్ ఘటనలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించడానికి గల కారణాలను వెల్లడించారని చెబుతున్నారు.
మరి దిల్ రాజు చెప్పింది మాత్రమే నిజమా..? అది మాత్రమే మీటింగ్ లో జరిగిందా..? లేక, సీఎం ఆఫీసు నుంచి మీడియాకు వచ్చిన లీకుల్లు కూడా నిజమేనా..? ఆ లీకులు ప్రభుత్వం కావాలనే చేసిందా..? అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.