బిహార్ వల్లే దేశం అభివృద్ధి చెందట్లేదన్న టీచర్ పై వేటు
పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌కు చెందిన టీచర్ దీపాలి బిహార్‌లోని కేంద్రీయ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
By: Tupaki Desk | 27 Feb 2025 9:30 PM GMTపశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌కు చెందిన టీచర్ దీపాలి బిహార్‌లోని కేంద్రీయ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీపాలి మాట్లాడుతూ "దేశంలో ఎక్కడైనా పని చేయవచ్చు కానీ బిహార్ లో కష్టం. ఇక్కడి ప్రజలకు సివిక్ సెన్స్ ఉండదు. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలవకపోవడానికి బిహారే కారణం. బిహార్ ను తీసేస్తే ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది" అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు విద్యార్థులు రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్ అయ్యాయి. దీని ఫలితంగా, బిహార్ వాసులు , రాజకీయ నాయకులు దీపాలి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరిచాయని, ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం అసహ్యకరమని వారు పేర్కొన్నారు.
ఈ వివాదంపై విద్యాశాఖ అధికారులు స్పందించి.. దీపాలిని విధుల నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. విద్యార్థులకు సమానత్వం, సహనం వంటి విలువలను బోధించాల్సిన స్థాయిలో ఉన్న ఓ ఉపాధ్యాయురాలు ఇలా మాట్లాడటం బాధాకరమని అధికారులు తెలిపారు. ఆమెపై మరింత విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు విద్యావ్యవస్థలో నైతిక విలువల పరిరక్షణ ఎంత కీలకమో గుర్తు చేస్తాయి. టీచర్లు తమ పదవికి తగ్గట్టుగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిహార్ ప్రజలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దీపాలి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.