Begin typing your search above and press return to search.

హసీనాకు భారీ షాక్.. ఆమె ఇక భారత్ లోనే.. దౌత్య పాస్ పోర్టు రద్దు

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి వచ్చేసిన షేక్ హసీనా ఇప్పటికే 18 రోజులుగా భారత్ లోనే ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Aug 2024 7:09 AM GMT
హసీనాకు భారీ షాక్.. ఆమె ఇక భారత్ లోనే.. దౌత్య పాస్ పోర్టు రద్దు
X

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి వచ్చేసిన షేక్ హసీనా ఇప్పటికే 18 రోజులుగా భారత్ లోనే ఉంటున్నారు. తొలుత ఆమె బ్రిటన్ వెళ్లాలని అనుకున్నా.. నెల ముందుగా కోరనందున నిబంధనలు అంగీకరించవంటూ తిరస్కరించారు. దీంతో ఆపదలో ఉన్న మన మిత్రాలిని ఆహ్వానించింది మోదీ ప్రభుత్వం. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోనే ఉన్నారు. తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) కోరుతోంది. ఇలాంటి సమయంలో హసీనాకు భారీ షాక్ ఇచ్చింది బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం. అత్యంత కీలకమైన దౌత్య పాస్‌ పోర్టును రద్దు చేసింది. హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో ఎంపీలకు జారీ చేసిన దౌత్య పాస్‌ పోర్టులనూ నిలిపివేసింది. రాజకీయ పదవుల్లో ఉన్నవారికి ఈ పాస్ పోర్టు అత్యంత కీలకం. కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఇస్తుంది దౌత్య పాస్ పోర్టు. హసీనా భారత్ కు ఇలానే రావడం ఇక్కడ గమనార్హం.

హత్యాభియోగాలు.. 30 కేసులు..

బంగ్లాదేశ్ లో జూలై, ఈ నెల మొదట్లో ఘర్షణలు చెలరేగి 400 మంది పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. బంగ్లా విముక్తి ఉద్యమంలో పాల్గొన్నవారి కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీనికిగాను హసీనా, ఆమె అనుచరులపై 30పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హసీనా గనుక బంగ్లాకు తిరిగి వెళ్తే జైలుపాల్జేయడం ఖాయం. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ప్రధాన కార్యదర్శి

మీర్జా ఫఖ్రుల్‌ ఇస్లామ్‌ ఆలంగిర్‌.. భారత్ హసీనాకు ఆశ్రయం కల్పించడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. భారత్ నుంచి బంగ్లా విజయాన్ని అడ్డుకునేందుకు హసీనా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించాడు. ఆమెను తమకు అప్పగించాలని డిమాండ్ చేశాడు. ఆమెను విచారిస్తామని చెబుతున్నాడు.

తాత్కాలిక ప్రభుత్వం వ్యతిరేకమే..

బంగ్లాదేశ్ లో నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం హసీనాను క్షమించేలా లేదు. ఇప్పటికే పార్లమెంటు రద్దయింది. యూనస్.. హసీనాను రాక్షసిగా అభివర్ణించారు. తాజాగా దౌత్య పాస్‌ పోర్టులను రద్దు చేశారు. దీంతో హసీనాకు మాజీ ప్రభుత్వాధినేతగా ఉన్న దౌత్య వెసులుబాట్లు లేకుండాపోతాయి. అటు స్వదేశంలో హసీనాను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆమె భారత్ లో ఉండడాన్ని తప్పుబడుతున్నాయి.

భారత్ లోనే బంగ్లా మాజీ ప్రధాని

దౌత్య పాస్ పోర్టు రద్దుతో భారత్ ను విడిచి హసీనా ఇప్పుడు ఎక్కడకు వెళ్తారు? అనేది తెలియని పరిస్థితి. ఆమె మరికొన్నాళ్లు భారత్ లోనే ఉండక తప్పదు. ఇంతకంటే సురక్షిత ప్రదేశం, దేశం కూడా హసీనాకు వేరేది లేదు. ఇప్పటికే హసీనా 1974 నుంచి ఆరేళ్ల పాటు భారత్ లోనే ఉన్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా ఆమె చెల్లెలు రెహానా వెంట ఉన్నారు. అయితే, అప్పుడు కేవలం 20 ఏళ్ల యుక్త వయస్కురాలు హసీనా. ఇప్పుడు 74 ఏళ్ల వయోధికురాలు. కాబట్టి హసీనా సోదరితో కలిసి భారత్ లోనే కొన్నాళ్లు పాటు ఉండిపోవడం ఖాయం.