ప్రముఖ దర్శకుడు తన ఇంట్లోనే ఆత్మహత్య
ప్రముఖ కన్నడ దర్శకుడు, `రంగనాయక` ఫేం గురు ప్రసాద్ ఆదివారం ఉదయం తన బెంగళూరు అపార్ట్‌మెంట్‌లో మరణించినట్లు గుర్తించారు.
By: Tupaki Desk | 3 Nov 2024 10:50 AM GMTప్రముఖ కన్నడ దర్శకుడు, `రంగనాయక` ఫేం గురు ప్రసాద్ ఆదివారం ఉదయం తన బెంగళూరు అపార్ట్‌మెంట్‌లో మరణించినట్లు గుర్తించారు. అతడి వయసు 52. రెండు లేదా మూడు రోజుల ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర బెంగళూరులోని మదనాయకనహళ్లి ప్రాంతంలో గత ఎనిమిది నెలలుగా నివసిస్తున్న ఆయన ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు ఈ విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసారు.
మీడియా కథనాల ప్రకారం.. గురు ప్రసాద్ తన తాజా చిత్రం రంగనాయక బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. పెరిగిన అప్పులతో సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. అతడి కష్టాలు డిప్రెషన్‌లోకి నెట్టాయి. మాట (2006), ఎడ్డెలు మంజునాథ (2009) సహా పలు విమర్శనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించారు గురు ప్రసాద్. కన్నడ రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా కూడా కనిపించారు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోవడంతో ఇటీవల మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. గురుప్రసాద్ తన వ్యంగ్య శైలి , సామాజిక సంబంధిత ఇతివృత్తాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
అతడి తొలి చిత్రం మాట (2006).. ఆ సినిమా స్క్రీన్ ప్లే కి గొప్ప ప్రశంసలు దక్కాయి. అతడు ఆ తర్వాత ఎడ్డెలు మంజునాథ (2009) అనే డార్క్ కామెడీని రూపొందించాడు. అది అతని అత్యంత ప్రసిద్ధ రచనలలో ఒకటిగా మారింది. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం దిగువ-మధ్యతరగతి నేపథ్యంలో ఉదాసీనత, పోరాటాల నేపథ్యంలో తెరకెక్కింది.
జీవితాన్ని పచ్చిగా, వాస్తవికంగా తెరపై చిత్రీకరించినందుకు గొప్ప ప్రజాదరణ పొందింది. 2013లో అతడు డైరక్టర్స్ స్పెషల్, వ్యంగ్యపు కథనంతో మరొక సినిమాని విడుదల చేశాడు. ఇది చలనచిత్ర పరిశ్రమపై విమర్శలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అతడి తదుపరి చిత్రం ఎరదనే సాలా (2017) సంక్లిష్టమైన ప్రేమకథతో రూపొందింది. గురుప్రసాద్ తెరకెక్కించిన ఇటీవలి చిత్రం `రంగనాయక` 2024లో విడుదలైంది. దురదృష్టవశాత్తూ బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఆడింది. ఇది అతడి ఆర్థిక ఇబ్బందులను పెంచింది.