Begin typing your search above and press return to search.

ఇదేం పోయేకాలం? గుళ్లో ప్రసాదం తిన్నాడని చంపేయటమా?

ఇదేం పోయే కాలం? మతం మీద అభిమానం తప్పేం కాదు. కానీ.. ఆ పేరుతో ప్రదర్శించే దురభిమానాన్ని మాత్రం తప్పనిసరిగా ఖండించాల్సిందే

By:  Tupaki Desk   |   28 Sept 2023 10:11 AM IST
ఇదేం పోయేకాలం? గుళ్లో ప్రసాదం తిన్నాడని చంపేయటమా?
X

ఇదేం పోయే కాలం? మతం మీద అభిమానం తప్పేం కాదు. కానీ.. ఆ పేరుతో ప్రదర్శించే దురభిమానాన్ని మాత్రం తప్పనిసరిగా ఖండించాల్సిందే. తప్పుడు పనులు చేసిన వాళ్లు ఎవరైనా కావొచ్చు.. వారిని క్షమించకూడదు. అందరిని తనలో కలుపుకునే హిందూమతానికి మచ్చ తెచ్చేలా జరిగిన ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. ఒక దివ్యాంగ ముస్లిం ఒకరు గుళ్లో ప్రసాదం తిన్నందుకు ప్రాణాల్ని కోల్పోవాల్సి రావటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఆకలితో ఉన్న వేళ.. ఆయువు నిలిపే ప్రసాదం తింటే తప్పేంటి? ఛాందసవాదంతో మతసామరస్యాన్ని దెబ్బ తీసే ఇలాంటి ఘటనలపై మరింత కరకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలోని సుందర్ నగరి ప్రాంతంలో దివ్యాంగ ముస్లిం ఒకరు అక్కడి ఆలయంలో ప్రసాదం తిన్నాడు. దీన్ని గుర్తించిన స్థానికులు కొందరు ఆ వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ క్రమంలో ప్రసాదం తిన్న వ్యక్తి దెబ్బలకు తాళలేక ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రసాదం తిన్నాడన్న కోపంతో కర్రలతో దారుణంగా కొట్టిన వైనం చూసినోళ్లంతా షాక్ తింటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్ కావటంతో ఢిల్లీ పోలీసులు వాయు వేగంతో స్పందించారు. ఈ దారుణ ఘటనకు సంబంధం ఉన్న వారిని గుర్తించే ప్రయత్నం చేయటంతో పాటు.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విచారణను చేపట్టారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇలాంటి ఉదంతాల్ని అస్సలు క్షమించకూడదని వ్యాఖ్యానిస్తున్నారు.